న్యాయమూర్తులపై దూషణల కేసుల్లో సీబీఐ అధికారులు లాయర్లను పట్టుకున్నారు. ఈ కేసులో తాజాగా ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. లాయర్లు చంద్రశేఖర్, గోపాలకృష్ణతో పాటు మరో వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిని హైదరాబాద్ సీబీఐ ఆఫీస్లో విచారిస్తున్నారు. ముగ్గురు నిందితులను విజయవాడకి తరలించి కోర్టులో హాజరుపర్చనున్నారు. రెండు రోజుల కిందట అనంతపురంతో పాటు పలు చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఫోన్లు, ల్యాప్ ట్యాప్లు వంటివి సేకరించి ఆధారాలు బయటకు తీస్తున్నారు. మరో వైపు ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో పని చేస్తున్న వారినీ కొంత మందిని సీబీఐ అధికారులు ఇప్పటికీ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ట్వీట్లు.. ఇతర ఆధారాలు తొలగించినప్పటికీ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ సీబీఐ సేకరించినట్లుగా తెలుస్తోంది. సీబీఐ అరెస్టు చేసిన లాయర్లు ఇద్దరూ హైకోర్టు లాయర్లుగానే వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ కూడా అధికార పార్టీతో దగ్గర సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు.
వారు పెట్టిన దూషణల కంటెంట్ ఎవరు ఇచ్చారు.. వారు సొంతంగా పెట్టారా.. ఎక్కడి నుంచి అయినా తెప్పించారా అన్న విషయాలపైనా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా న్యాయమూర్తులపై దూషణల కేసులో సీబీఐ అధికారులు వీలైనంత త్వరగా ఓ తార్కికమైన ముగింపు తేవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.