ఆయేషా మీరా కేసులో సీబీఐ అధికారులు మళ్లీ విచారణ ప్రారంభించారు. అప్పటి పోలీసు అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే హాస్టల్ వార్డెన్ వంటి వాటిని కూడా ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ కేసులో అసలు క్లూ లేకుండా పోయింది. అరెస్ట్ చేసిన సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో రికార్డులన్నీ పోయాయి. దీంతో సీబీఐ మొదటి నుంచి విచారణ ప్రారంభించింది. నాలుగేళ్ల కిందట విచారణ చేసి.. ఆయేషా మీరా సమాధి తవ్వి రీపోస్ట్ మార్టం కూడా చేశారు. తర్వాత సైలెంట్ అయ్యారు.
అయితే అనూహ్యంగా ఇప్పుడు మళ్లీ విచారణ ప్రారంభించారు. ఈ కేసును ఎందుకు తేల్చడం లేదనే అంశంపై రాజకీయ దుమారం కూడా రేగలేదు. అయినా సీబీఐ ఎందుకు టేకప్ చేశఆరో కానీ.. ఇటీవల బండి సంజయ్ ఈ కేసు విషయంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం హైలెట్ అవుతున్నాయి. టెన్త్ పేపర్ల లీక్ కేసులో బండి సంజయ్ ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ కుట్ర చేశారని ఆరోపించారు. బెయిల్ పై విడుదలైన తర్వాత బండి సంజయ్ సీపీ రంగనాథ్ పై చాలా ఆరోపణలు చేశారు. అందులో ఆయేషా మీరా కేసు విషయంలో కూడా ఆయనేం చేశారో తెలుసని ట్విస్ట్ ఇచ్చారు.
తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన సీపీ రంగనాథ్.. ఆయేషా మీరా కేసులో తాను విచారణ అధికారిని కాదన్నారు. కానీ ఆయనకు ఈ కేసు విచారణలో లింక్ ఉందన్న ఓ అభిప్రాయాన్ని బండి సంజయ్ కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీపీ రంగనాథ్ ను వదిలి పెట్టబోమని హెచ్చరించారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేయడంపై బీజేపీ హైకమాండ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ ఆయేషా మీరా కేసు.. బండి సంజయ్ చెప్పినట్లుగా మెల్లగా వరంగల్ సీపీ దగ్గరకు వెళ్తే సంచలనం అయ్యే చాన్స్ కూడా ఉన్నాయి.