వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఆయుధాల కోసం వెదుకులాట ప్రారంభించారు. వైఎస్ వివేకా సన్నిహితుడు సునీల్ కుమార్ యాదవ్‌ను పది రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు తొలి రోజే.. ఆయుధాల సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. ఉదయం ఆయనను కడప సెంట్రల్ జైలు నుంచి సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకుని.. విచారణ జరుపుతున్న గెస్ట్ హౌస్‌కు తరలించారు. తర్వాత కాసేపటికే లోకల్ పోలీసులతో కలిసి ఓ చెరువులో వెదుకులాట ప్రారంభించారు. ఇటీవల వర్షాలు పడటంతో ఆ చెరువులో నీరు చేరింది.
నీరు తోడించి.. పూర్తి స్థాయిలో జల్లెడ పట్టే అవకాశం ఉంది. వివేకానందరెడ్డిని హత్య చేసిన ఆయుధాలు అక్కడ దాచి ఉంచి ఉంటారని సునీల్ యాదవ్ సమాచారం ఇవ్వడంతోనే అక్కడ సోదాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గొడ్డలితో నరికారని వివేకా ఒంటిపై ఉన్న గాట్లు.. తలపై ఉన్న పదునైన గాయం కారణంగా చాలా మంది ఓ అభిప్రాయానికి వచ్చారు. పోస్ట్ మార్టం రిపోర్టులోనూ అదే బయటపడింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. అయితే అందరూ ఆత్మహత్య అని నమ్మించే ప్రయత్నం చేయడం.. పోలీసులెవరూ.. సీరియస్‌గా కేసు చేదనకు ప్రయత్నించకపోవడంతో ఆయుధాల గురించి అసలు ఆలోచనే చేయలేదు.
చివరికి సీబీఐ ఇప్పుడు సునీల్ యాదవ్‌ను ప్రశ్నించిన తర్వాత కాస్త క్లూ కనిపెట్టినట్లుగా భావిస్తున్నారు. హత్య కేసులో సునీల్ యాదవ్ ప్రమేయం ఉందని సీబీఐ కోర్టులో వాదించింది. అయితే నిజంగా వైఎస్ కుటుంబసభ్యులకు తెలియకుండా.. వారి ఫ్యామిలీలో హత్య చేసి ఎవరైనా పులివెందులలో బతకగలరా అని ఇతర పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎలా చూసినా వివేకా కేసు విచారణ.. అనేకానేక సందేహాలు కలిగిస్తూనే ఉంది.