ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాసుపత్రుల్లో అడుగుపెడితే అవినీతే. డాక్టర్లు ఉండరు. జీతాలు తీసుకునేవారు సొంత క్లినిక్‌లు పెట్టుకుంటారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారిని.. తమ క్లినిక్‌లను తరలించుకుంటూ ఉంటారు. స్టాక్ లిస్ట్‌లో పెద్ద ఎత్తువ మందులు ఉంటాయి. కానీ స్టోర్‌లో మాత్రం ఉండవు. వాటిని పేదలకు పంపిణీ చేయరు. చేసినట్లుగా రాసుకుంటారు. ఇక ఉద్యోగులు పని చేసేవారు కూడా.. ఒకరికి బదులు ఒకరు విధులు నిర్వహిస్తూంటారు. ఈ అవకతవకలన్నీ.. రెండు రోజుల పాటు.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏసీబీ తనిఖీల్లో బయటపడ్డాయి. అవినీతిని అంతమొందించాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏసీబీకి ప్రత్యేకమైన సూచనలు చేశారు. సామాన్యులు ఎక్కువగా సేవలు పొందే ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని అంతమొందించాలని.. ఆదేశించారు.
దీని ప్రకారం.. కొద్ది రోజుల కిందట.. రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు.. రెండు రోజులుగా.. ప్రభుత్వాసుపత్రులపై దృష్టి పెట్టారు. 13 బృందాలుగా ఏర్పడిన వందమంది ఏసీబీ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించారు. పలు చోట్ల పని చేయని అంబులెన్స్‌లకు కూడా బిల్లులు పెట్టి వసూలు చేసుకున్న వైనం బబయటపడింది. రోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. డైట్‌ను అందించాల్సి ఉంది. అయితే.. ఏ ఆస్పత్రిలోనూ.. వారికి భోజనం అందిస్తున్న దాఖలాలు లేవు. కొన్ని ఆస్పత్రుల్లో ఇస్తున్నప్పటికీ.. అవి రోగులు తినే విధంగా లేవు. గుడివాడలో.. అసలు పని చేయని అంబులెన్స్ డ్రైవర్ జీతం కింద.. ఆరు నెలల్లో నాలుగున్నర లక్షలు సొమ్ము డ్రా చేశారు.
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని ఆస్పత్రుల్లో జరిపిన సోదాల్లో కూడా దాదాపు ఇదే తరహా అక్రమాలు అవకతవకలు గుర్తించారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన వినియోగం, శానిటేషన్, మందులు కొనుగోలు, రోగులకు ఇచ్చే ఆహార నియమాలు, వైద్యులు, సిబ్బంది హాజరు వంటి అంశాల్లో భారీ ఎత్తున వైఫల్యాలు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ఇవన్నీ ఏసీబీ సోదాల్లో బయటపడ్డాయేమో కానీ మొత్తం బహిరంగమే. ఏ వ్యవస్థ.. ఈ ఆస్పత్రి వ్యవస్థను బాగు చేయలేకపోయింది. ఇప్పుడు.. ముఖ్యమంత్రి జగన్.. ఏసీబీ ద్వారా.. ఈ ఆస్పత్రులపై దృష్టి పెట్టారు. ఇప్పుడైనా బాగుపడుతుందో.. ఆరంభశూరత్వంగా మిగిలిపోతుందో చూడాలి…!