ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రయేయంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మళ్ళీ విచారణ మొదలుపెట్టింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి చిక్కులు మొదలయ్యాయి. తెలంగాణ హైకోర్టులో ఊరట లభించినప్పటికీ సుప్రీం కోర్టులో ఆమె భవిష్యత్ తేలనుంది. తాజాగా ఆమెపై ఉన్న కేసులపై సుప్రీం కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. దీంతో కేసుల వ్యవ హారం మరోసారి సీరియస్ అయ్యింది.
జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ వేయటం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పేరును తొలగించిన తెలంగాణ హైకోర్టు అభిప్రాయాన్ని కాదని, ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఉందంటూ సుప్రీంలో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు పదేళ్ళు గడిచినప్పటికీ జగన్ అక్రమాస్తుల కేసు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని వెంటాడుతూనే ఉంది. ఈ కేసు నుంచి ఆమెను వదిలిపెట్టకూడదని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది.
ఓబులాపురం ఐరన్‌ఓర్ కంపెనీకి సంబంధించి గనుల కేటాయింపు విషయంలో శ్రీలక్ష్మి పాత్ర ఉందని పిటిషన్లో పేర్కొంది. ఈ కేసులో ఆమెను మళ్ళీ విచారించాల్సిందేనని స్పష్టంగా తెలిపింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు నుంచి సాంకేతిక అంశాలతో ఊరట లభించడంతో సీబీఐ తీరుపై విమర్శలు వచ్చాయి. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. విచారించాల్సిందేనని చెబుతోంది. సుప్రీంకోర్టుకు అయినా స్పష్టమైన సాక్ష్యాలు సమర్పిస్తుందో లేదోనన్న సందేహాలు ఈ కేసులను పరిశీలిస్తున్న వారు వ్యక్తం చేస్తున్నారు.