వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ డ్రైవర్లు, పనివాళ్లు, వ్యాపార సంబంధాలు ఉన్న వాళ్లు, చెప్పుల దుకాణం వాళ్లను ప్రశ్నిస్తూ వచ్చిన సీబీఐ ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని కీలక వ్యక్తుల్ని ప్రశ్నించడం ప్రారంభించింది. రెండు రోజుల నుంచి ఎంపీ వైఎస్ అవినాషన్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ ముందు హాజరవుతున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అన్నదమ్ములను కూడా సీబీఐ పిలిపించి ప్రశ్నిస్తోంది. సీఎం క్యాంపాఫీస్ ఉద్యోగిని కూడా సీబీఐ విచారించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పులివెందుల,కడపలో రెండు సీబీఐ బృందాలు మకాం వేసి అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నాయి.
మొహమాటానికో.. రాజకీయ ఒత్తిళ్ల వల్లో కానీ సీబీఐ ఇంత వరకూ ప్రధాన అనుమానితులుగా వైఎస్ వివేకా కుమార్తె సునీతజాబితా ఇచ్చిన వారిని ప్రశ్నించలేదు. అదే సమయంలో దారుణమైన హత్య జరిగినప్పటికీ గుండె పోటుగా నమ్మించే ప్రయత్నం చేసినవారిని.. మృతదేహాన్ని తరలించి సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన వారిని ఇంత వరకూ ప్రశ్నించలేదు. తొలి సారిగా ఇప్పుడు ఆ పనిని సీబీఐ ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు. వివేకా సన్నిహితుడు సునీల్ యాదవ్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. కేసును ఆయనతో ముగించాలనుకుంటోందన్న విమర్శలు ఎదుర్కొంది. ఆయన కుటుంబసభ్యులు కూడా వైఎస్ వివేకాను చంపేంత పెద్ద వాళ్లం కాదని.. దమ్ముంటే హత్య కేసులో ఉన్న పెద్దవాళ్లను అరెస్టులు చేయాలని ప్రకటనలు చేశారు.
కారణం ఏదైనా సీబీఐ ఇప్పటికి రైట్ ట్రాక్‌లో వచ్చిందని భావిస్తున్నారు. ఇప్పటికి సీబీఐ అధికారులు మూడో విడత విచారణ ప్రారంభించి రెండున్నర నెలలు దాటిపోయింది. సునీల్ యాదవ్‌ను మరోసారి కస్టడీకి ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఆయనకు నార్కో పరీక్షలు నిర్వహించాలని సీబీఐ అనుకుంటోంది. ఈ మేరకు కోర్టులో పిటిషన్లు వేసింది. ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. కానీ సీబీఐ మాత్రం ఒత్తిళ్లను తట్టుకుని ఒక్కో అడుగు ముందుకేస్తోదంని.. త్వరలో సంచలనాలు ఉండవచ్చన్న అభిప్రాయం మాత్రం కడప, పులివెందుల్లో వినిపిస్తోంది.