కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని సీబీఐ, ఈడీలు సోదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత ఏడాది కాలంలో.. ఇప్పటికి.. ఐదారు సార్లు సుజనా చౌదరి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు సోదాలు చేసుకున్నారు. ఎన్ని సార్లు సోదాలు చేసిన కీలక డాక్యుమెంట్లు దొరుకుతున్నాయని చెబుతున్నారు కానీ.. సుజనా చౌదరిపై స్పష్టమైన కేసును మాత్రం నమోదు చేయలేకపోతున్నారు. గతంలో.. ఈడీ, సీబీఐ చెన్నై, బెంగళూరుకు పిలిపించి విచారించారు. మరోసారి బెంగళూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం సోదాలు చేసింది. ఏకకాలంలో మూడు చోట్ల ఈ సోదాలు నిర్వహించారు.
కర్నాటక రిజిస్టర్ అయిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ రుణాలు తీసుకుని… దుర్వినియోగం చేసిందనే కేసులో…సుజనా చౌదరిని సీబీఐ, ఐటీ వెంటాడుతున్నాయి. ఆ కంపెనీ తప్పుడు ఇన్వాయిస్లతో రుణాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీకి బదిలీ చేసింది సీబీఐ. ఆంధ్రా బ్యాంక్‌కు రూ.71 కోట్లు రుణం ఎగవేయడం ఈ కేసులో కీలకం. ఈ కంపెనీ ఐదుగురు డైరెక్టర్లు, ఎండీలపై కేసు నమోదు చేశారు. అయితే.. ఈ డైరక్టర్లు,ఎండీల జాబితాలో సుజనా చౌదరి లేరు. అయితే గతంలో.. ఈ కంపెనీ సుజనా చౌదరిదేనని.. ఆయనే ఈ కంపెనీ నిర్వహించారని.. సీబీఐ, ఈడీ వర్గాలు చెబుతున్నాయి. తీసుకున్న రుణాలను దారి మళ్లించారని… ఆరోపిస్తున్నారు. కానీ సుజనా మాత్రం.. తనకే సంబంధం లేదని వాదిస్తున్నారు.
ఎన్నికలకు ముందు సుజనా చౌదరికి సీబీఐ నోటీసులు ఇవ్వడంతో ఆయన విచారణకు హాజరు కాలేదు. అసలు తనకు సంబంధమే లేని కేసులో సీబీఐ నోటీసులు జారీ చేసిందని… వాటినిర ద్దు చేయాలని హైకోర్టుకు కూడా వెళ్లారు. అయితే కోర్టు సుజనా చౌదరి దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కానీ కొంత వెసులుబాటు కల్పించారు. మే 27, 28 తేదీల్లో రెండ్రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. అయితే.. సుజనా సీబీఐ విచారణకు హాజరయ్యారో లేదో క్లారిటీ లేదు. ఆ గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ కేసు…చాలా కాలంగా సాగుతోంది. ఆరేడేళ్లుగా… అవసరమైనప్పుడు మాత్రమే బయటకు తీసి… హడావుడి చేస్తున్నారు.