తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ విచారణ ప్రారంభించంది. పల్నాడులో లైమ్ స్టోర్ అక్రమ తవ్వకాలు జరిగాయంటూ ఏపీ సర్కార్ సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. గత ఆగస్టులో సిఫార్సు చేయగా.. ఇప్పుడు సీబీఐ బృందాలు పని ప్రారంభించాయి. గురువారం ఒక్క రోజే దాదాపుగా పాతిక చోట్ల.. సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఇంట్లో కూడా సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ తోపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లోఈ సోదాలు జరిగాయి. అక్రమ మైనింగ్‌లో యరపతినేని హస్తం ఉందని.. ఆంధ్రా బ్యాంకులో యరపతినేనికి సంబంధించిన అక్రమ లావాదేవీలు జరిగాయని సీఐడీ గతంలో ప్రకటించింది.
గురజాల నియోజకవర్గంలోని నడికుడి, కోనంకి, కేశానుపూడి గ్రామాల్లో అక్రమంగా సున్నపురాయి తవ్వకాలు జరుపుతున్నారంటూ… 2015లో కొంత మంది వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా అక్రమ తవ్వకాలను.. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులే చేపడుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అక్రమ మైనింగ్ నిలిపివేయాలని… ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని వసూలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీజీవీ కృష్ణారెడ్డి దీనిపై మరో పిల్ వేశారు. హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని .. ఎమ్మెల్యే యరపతినేనిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారింది. తాము సీబీఐతో విచారణ చేయిస్తామని ఏపీ సర్కార్ హైకోర్టుకు తెలిపింది. దానికి హైకోర్టు అంగీకరించింది.
ఏపీలో గత ప్రభుత్వం సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసింది. కొత్త ప్రభుత్వం రాగానే జనరల్ కన్సెంట్ ను పునరుద్ధరించింది. అయితే సరస్వతీ భూముల విషయంలో రైతులకు అండగా ఉన్నందుకే జగన్ తనపై కక్ష కట్టారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. సీబీఐ అధికారులను ఉరకుక్కలని దూషించిన నాయకులు ఇప్పుడు సీబీఐ దర్యాప్తు కు సిఫార్సు చేయడం ఏమిటని ఆయన గతంలో మండిపడ్డారు. ఇప్పుడు సీబీఐ విచారణ ప్రారంభించింది. అక్రమ మైనింగ్‌లో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.