గుంటూరు జిల్లా తెనాలిలో… ఇన్కం ట్యాక్స్-1వ విభాగం అధికారి చంద్రశేఖర్ రెడ్డి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కారు. ఓ వ్యాపారి ఫిర్యాదు మేరకు విశాఖపట్నం నుంచి సీబీఐ డీఎస్పీ నరేంద్ర ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం ఐటీ అధికారిని ట్రాప్ చేసి పట్టుకుంది. ఆ క్రమంలో కొంత హైడ్రామా జరిగింది. ఆ హైడ్రామా సంగతేమో కానీ.. అసలు సీబీఐకి ఏపీలో దాడులు చేయడానికి అధికారం లేదు. కోర్టు పర్మిషన్ ఉంటే తప్ప.. ఏపీలో.. సీబీఐ ఎలాంటి దాడులు చేయకూడదు. అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైనా సరే. సీబీఐని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారన్న ఉద్దేశంతో… ఆ సంస్థకు ఇచ్చిన జనరల్ కన్సెంట్ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఫలితంగా.. సీబీఐకి.. ఏపీలో నో ఎంట్రీ బోర్డు పడింది. కోర్టు ఆదేశాలున్న కేసులు మాత్రమే.. విచారించే అవకాశం ఉంది. అయితే.. ఇప్పుడు సీబీఐ అధికారులు నేరుగా… ఓ ఐటీ అధికారిని ట్రాప్ చేశారు. ఇదే వివాదాస్పదం అవుతోంది.
అసలు అధికారం లేకుండా… రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా… సీబీఐ దాడులు చేయడం ఏమిటన్న చర్చ ప్రారంభమయింది. నిబంధనల ప్రకారం… సీబీఐకి ఏమైనా పిర్యాదులు వస్తే… ఆ ఫిర్యాదు ప్రకారం చర్యలు తీసుకోవాలంటే… ముందుగా పోలీసులు, సాధారణ పరిపాలన శాఖ అనుమతి తీసుకోవాలి. వారు అనుమతి ఇస్తే.. ముందుకెళ్లాలి. కానీ… ఇలాంటివేమీ లేకుండానే… సీబీఐ దాడి చేయడంపై పోలీసు శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీబీఐ అధికారులు చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని చెబుతున్నారు. కోర్టుకు వెళ్లినా కూడా సీబీఐ దాడి చెల్లదన్న అభిప్రాయాలు ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితకే సీబీఐ అధికారులు మాత్రం.. భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. ట్రాప్ కేసుల్లో అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. అవసరం అయితే దాడి తర్వాత అనుమతి కోరవచ్చని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే కేసును ఏసీబీకి అప్పగిస్తామని అంటున్నారు.
జనరల్ కన్సెంట్ ను రద్దు చేసిన తర్వాత సీబీఐకి .. ఏపీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చి ఉంటాయి. కానీ వేటిపైనా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు.. ఏపీలో ఉన్నది ఆపద్దర్మ ప్రభుత్వం అంటూ.. ఈసీ, సీఎస్ కొత్త తరహా వాదన వినిపిస్తూ.. పాలన చేసుకుంటునన సమయంలో.. సీబీఐ ఇలా దాడులు చేయడం… కలకలం రేపుతోంది. దీని వెనుక ఉన్నత స్థాయి ప్రణాళిక ఉందన్న అనుమానాలు టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. జనరల్ కన్సెంట్ ను బ్రీచ్ చేసి… దానికి ప్రాధాన్యం లేదని చెప్పే ప్రయత్నం జరుగుతందోన్న అుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఏపీలో ఏసీబీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రజాప్రతినిధులు సహా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ… ఏసీబీ కిందకే వస్తారు. ఇదే విషయాన్ని ఏసీబీ చీఫ్ గా కొద్ది రోజుల కిందట.. బాధ్యతలు చేపట్టిన… డీజీ వెంకటేశ్వరరావు కూడా చెప్పారు. ఈ లోపే సీబీఐ.. ఏపీలో సొంత పెత్తనం ప్రారంభించింది. ఇది ఎక్కడి వరకూ వెళ్తుందో.. వేచి చూడాలి..!