తెలుగుదేశం పార్టీ హయాంలో అడ్వకేట్ జనరల్‌గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఆంధ్రప్రదేశ్ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన కృష్ణా జిల్లాలో తన భార్య పేరుపై, బావమరిది పేరుపై భూములు కొనుగోలు చేశారని గుర్తించామని ఏసీబీ ప్రకటించింది. అమరావతిలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయని.. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తూ..ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది . ఆ సిట్ వివిధ రకాలుగా విచారణ జరిపి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. కేసులు పెట్టాలని ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా మొదట.. దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది.
దమ్మాలపాటి శ్రీనివాస్ గతంలో ఏజీగా పని చేశారు. ఇప్పుడు… ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలవుతున్న కీలకమైన కేసుల్ని వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో…, ఆయనపై కేసుల అస్త్రం ప్రయోగించడం చర్చనీయాంశం అవుతోంది. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకూ ఆయన భూములు కొనుగోలు చేశారని.. ఆ భూములన్నీ… సీఆర్డీఏ పరిధి… కోర్ క్యాపిటల్ ఏరియా పరిధిలో ఉన్నాయని ఏసీబీ చెబుతోంది. 2015-16లోనూ దమ్మాలపాటి శ్రీనివాస్ భూములు కొనుగోలు చేశారని తమ దర్యాప్తుల్లో తేలిందని ఏసీబీ చెబుతోంది.
నిజానికి భూముల కొనుగోళ్ల విషయంలో కేసులు నమోదు చేయడానికి ఏసీబీకి ఎలాంటి అధికార పరిధి ఉందో న్యాయనిపుణులకు కూడా అర్థం కావడం లేదు. దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఆయన భూములు కొనుగోలు చేయడం కూడా నేరం కాదు. ఒక వేళ ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరిట కొనుగోలు చేశారని చెప్పుకోవడానికి ఆయన టీడీపీ నేత కూడా కాదు. ఓ న్యాయవాది మాత్రమే. ఆస్తులు కొనుగోలు చేయడం తప్పు ఎలా అవుతుందో..ఇప్పటికి చాలా మందికి అర్థం కాని విషయం. ఏసీబీ కేసుల విషయంలో.. అమరావతి భూముల విషయంలో మరిన్ని కీలకమైన అంశాలు బయటకు రావాల్సి ఉంది. సిట్ వేసి..సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన ఏపీ సర్కార్ .. ఇప్పుడు హడావుడిగా ఏసీబీ ద్వారా కేసులు నమోదు చేయించడం.. చర్చనీయాంశం అవుతోంది.