భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అగరబత్తీలను తయారు చేసి.. ప్రముఖ పారిశ్రామికవేత్తగా.. సినీ నిర్మాతగా.. రాజకీయ నాయకుడిగా కూడా ఎదిగిన అంబికా కృష్ణ … ఇతర రాజకీయ పారిశ్రామికవేత్తల్లానే బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారు. తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా ఉంటూ.. ఐదేళ్ల పాటు ఎఫ్డీసీ చైర్మన్ పదవిని అనుభవించిన ఆయన తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే.. వెళ్లి బీజేపీలో చేరిపోయారు. రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు కొంత మంది బీజేపీలో చేరారంటే.. వారికి రక్షణ కోసం అలా వెళ్లారని అనుకున్నారు.
కానీ అంబికా కృష్ణ ఎందుకు వెళ్లారో చాలా మందికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు క్లారిటీ వస్తోంది. ఆయనకు చెందిన సంస్థలు పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టాయి. తీసుకున్న రుణాలను దారి మళ్లించి… ఇప్పుడు కట్టడం మానేశారు. దాంతో ఆ బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. సీబీఐ అధికారులు అంబికా కృష్ణ కుటుంబీకుల ఇళ్లు, వ్యాపార సంస్థల్లో సోదాలు చేశారు. నిజానికి గతంలోనూ ఓ సారి సోదాలు నిర్వహించారు.
ఆ తర్వాత సైలెంటయ్యారు. ఇప్పుడు మళ్లీ సోదాలు ప్రారంభించారు. కారణం ఏమిటో తెలియదు కానీ.. టీడీపీలో ఉన్నప్పుడు చాలా మంది నేతలపై సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. వారంతా.. బీజేపీలో చేరిన తర్వాత దర్యాప్తు సంస్థలు సైలెంటయ్యాయి. ఇప్పుడు… అంబికా కృష్ణ బీజేపీలో చేరినా యాక్టివ్‌గా లేరనో.. లేకపోతే.. ఆయన వల్ల ఉపయోగం లేదని అనుకున్నారో.. బీజేపీ ఏపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు హిట్‌లిస్ట్‌లో ఉన్నారేమో కానీ.. కొత్తగా సోదాలు ప్రారంభమయ్యాయి. దీనిపై అంబికా కృష్ణ ఎలాంటి ప్రకటనా చేయలేదు.