ఆంధ్రప్రదేశ్‌లోకి సీబీఐని అనుమతిస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా.. మొదటగా ఆయన హిట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తే టార్గెట్ అయ్యారు. అయితే ఆయన రాజకీయ నేత కాదు. ప్రభుత్వ ఉద్యోగి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. అత్యంత కీలకమైన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్‌లో పనిచేసిన ఉన్నత ఉద్యోగి. అంతే కాదు.. జగన్మోహన్ రెడ్డికి చెందిన అక్రమాస్తుల కేసుల్లో.. ఈడీ తరపున చురుకుగా పరిశోధించిన దర్యాప్తు అధికారి కూడా. ఆయన పేరు శ్రీనివాస గాంధీ. ఈడీ మాజీ జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన శ్రీనివాస గాంధీ నివాసంలో సీబీఐ సోదాలు చేసింది. హైదరాబాద్, విజయవాడలో ఏక కాలంలో సీబీఐ సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర జీఎస్టీ విభాగంలో సూపరింటెండెంట్‌గా శ్రీనివాస గాంధీ ఉన్నారు.
శ్రీనివాస గాంధీపై… జగన్మోహన్ రెడ్డి.. నేరుగా ప్రధానికే పలుమార్లు అధికారిక లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. అక్రమాస్తుల కేసుల్లో.. ఈడీ.. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులుగా భావించిన అనేక ఆస్తులను ఎప్పటికప్పుడు జప్తు చేసింది. ఈ జప్తులు చేయడంలో.. అప్పట్లో దర్యాప్తు అధికారులుగా ఉన్న ఉమాశంకర్ గౌడ్, శ్రీనివాసగాంధీ అనే అధికారులు చురుగ్గా వ్యవహరించారు. వీరిద్దరూ వేధిస్తున్నారని.. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రధానికి ప్రత్యేక లేఖ రాసి.. కలిసి మరీ ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. జగన్మోహన్ రెడ్డి భార్య భారతి పేరును కూడా చార్జిషీట్లో చేరుస్తూ.. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దాన్ని కోర్టు అంగీకరించింది. అప్పుడు కూడా.. జగన్మోహన్ రెడ్డి ఈ అధికారులపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత… ఈ అధికారులను కేంద్రం బదిలీ చేసింది. ఇప్పుడు… ఆ అధికారుల్లో ఒకరైన శ్రీనివాస గాంధీపై సీబీఐ గురి పెట్టడం ఆసక్తికరంగా మారింది.
రాజకీయ కారణాలతో.. సీబీఐను..కక్ష సాధింపు కోసం వాడుకుంటున్నారన్న ఉద్దేశంతో.. గత సీఎం.. ఏపీలోకి సీబీఐ రాకుండా.. జనరల్ కన్సెంట్ రద్దు చేశారు. అయితే.. జగన్ సీఎం అయిన వెంటనే..సీబీఐకి పర్మిషన్ ఇచ్చారు. ఇలా ఇచ్చిన వెంటనే.. జగన్ హిట్ లిస్ట్ లో పెట్టుకున్న ఈడీ అధికారిపైనే సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఇలా చేయడం.. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో దర్యాప్తు చేస్తున్న వారిని… కట్టడి చేయడమేనన్న భావన వ్యక్తమవుతోంది. అందు కోసమే ఈ తరహాలో సూచనలు పంపుతున్నారంటున్నారు. ఏదేమైనా మొత్తానికి చౌకీదార్ అనే నినాదం వినిపించిన ప్రధాని మోదీ… ఆశయానికి ఇప్పుడు… చౌకీదార్ అన్న యాక్షన్ కు చాలా తేడా కనిపిస్తోందన్న అభిప్రాయం మాత్రం…రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.