వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై కొత్తగా సీబీఐ కేసు నమోదయింది. రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియం ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు సీబీఐ కేసు నమోదు చేసి.. సోదాలు నిర్వహించారు. అయితే.. ఢిల్లీలో సీఎం జగన్‌తో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ భేటీ అయిన తర్వాతి రోజే ఇదంతా జరగడంతో.. జగన్ కక్షకట్టి చేయించారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అయితే.. రుణాలు తీసుకుని ఎగ్గొట్టడంలో రఘురామకృష్ణరాజు ట్రాక్ రికార్డు చిన్నదేమీ లేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయంలో ఆయన కంపెనీలు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. అక్కడ విచారణ జరుగుతోంది. ఆ సమయంలో కొత్తగా సీబీఐ కేసు పెట్టారు..ఇందులో మతలబు ఉంది కానీ.. ఆయనపై దాదాపుగా రూ. మూడు వేల కోట్ల రుణాల ఎగవేత ఆరోపణలు ఉన్నాయి.
ఇండ్-భారత్ పేరుతో రఘురామకృష్ణరాజు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు పెట్టారు. ఆయన కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఇండ్ – భారత్ కంపెనీ ఓ వెలుగు వెలిగింది. అంటే.. కరెంట్ ఉత్పత్తి చేయడంలో కాదు.. అప్పులు తెచ్చుకోవడంలో. ఇండ్-భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్, ఇండ్-భారత్ పవర్ ఇన్ఫ్రా (ఐబీపీఐఎల్), ఇండ్ భారత్ ఎనర్జీ (ఉత్కల్)లిమిటెడ్ .. ఇలా ఎక్కడ పవర్ ప్లాంట్ పెట్టాలనుకుంటే.. అక్కడ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఇలా దాదాపుగా పన్నెండు కంపెనీలు ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తామంటూ… ఈ కంపెనీలు దేశవిదేశాల్లోని వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. భారత్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ , రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ , ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రూ. వెయ్యి కోట్లు రుణాలు తీసుకున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించలేదు. ప్రాజెక్టులు నిర్మించలేదు. తీసుకున్న రుణాలన్నీ దారి మళ్లించారు. ప్రాజెక్టుల్లో 20 శాతం కూడా నిర్మాణం కాలేదు.
ఈ రుణాలు 2016లోనే మొండి బకాయిలుగా మారాయి. ఈ సంస్థ ఫిర్యాదు మేరకు.. గతంలోనే రఘురామకృష్ణంరాజుపై.. ఢిల్లీలో కేసు నమోదు అయింది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన అసెట్ మెనేజ్ మెంట్ కంపెనీ.. మెక్క్వరీ కూడా.. దాదాపుగా రూ. 800 కోట్లు ఇండ్ భారత్ కంపెనీలు ఎగ్గొట్టాయని భారత కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసి ఉన్నాయి. రఘురామకృష్ణ రాజు పెట్టిన కంపెనీల్లో ఓ రెండు కంపెనీలు.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న రూ.167 కోట్ల రుణం తిరిగి చెల్లించడంలో విఫలమమయ్యాయి. సరఫరా చేసిన బొగ్గుకు జరపడంలో విఫలమయ్యాయని గాంధార్ ఆయిల్ రిఫైనరీ కూడా.. కోర్టుల్లో కేసులు దాఖలు చేసింది.
ఈ మొత్తం రుణాలు, ఎగవేతల వ్యవహారం.. దాదాపుగా రూ. 3వేల కోట్లు ఉంటుంది. ఈ కేసులన్నీ ఇప్పుడు కోర్టులతో పాటు.. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ వద్ద ఉన్నాయి. రుణాలు ఇచ్చిన కంపెనీలన్నీ… ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై తదితర చోట్ల కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఆయాకంపెనీలను దివాలా తీసినట్లు ప్రకటించి.. తమ సొమ్ము తాము రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వతా రఘురామకృష్ణంరాజు ఇళ్లపై సీబీఐ అధికారులు ఓ సారి దాడులు చేశారు. హైదరాబాద్‌లోని ఎమ్మార్ బౌల్డర్ హిల్స్‌లో ఉన్న ఆయన విల్లాలో సోదాలు చేశారు. ఇప్పుడు మరోసారి కొత్తగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదు చేసింది.