తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన వ్యాపార సంస్థలు, ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. బ్యాంకులకు వందల కోట్ల రుణాలు తీసుకుని చెల్లించడంలో ఆయన కంపెనీలు విఫలమైనట్లుగా.. తెలుస్తోంది. ఈ మేరకు.. రాయపాటికి చెందిన ఇళ్లు, కార్యాలయాలు ఉన్న గుంటూరు, విజయవాడ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రాయపాటి కుటుంబానికి ట్రాన్స్ట్రాయ్ పేరుతో.. ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. అలాగే.. మరికొన్ని ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ గతంలో.. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌ను 14 శాతం లెస్‌కు దక్కించుకుంది. కానీ పనులు చేయలేక చేతులెత్తేసింది.
పోలవరం ప్రాజెక్ట్ కోసం.. ఇతర ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పి బ్యాంకుల వద్ద నుంచి ట్రాన్స్ట్రాయ్ పెద్ద ఎత్తున రుణాలు సమీకరించినట్లుగా తెలుస్తోంది. కానీ పోలవరం పనులు చేయలేకపోవడం.. గత ప్రభుత్వం.. ఈ కంపెనీ నుంచి పనులను తప్పించి.. ఇతరులకు ఇచ్చేయడంతో.. ట్రాన్స్ట్రాయ్ పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది. రుణాలు చెల్లించలేకపోయింది. అదే సమయంలో.. తనఖాగా పెట్టిన ఆస్తులు కూడా.. రుణాలకు సరిపోయే పరిస్థితి లేకపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో.. సీబీఐ రంగంలోకి దిగింది.
బ్యాంకులకు నిరర్థక ఆస్తులు పెరిగిపోతూండటంతో.. రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వ్యాపార సంస్థలపై.. ఇటీవలి కాలంలో సీబీఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అయితే.. ఈ దాడుల వెనుక రాజకీయం కూడా ఉందన్న ఆరోపణలు సహజంగానే వస్తున్నాయి. గతంలో నెల్లూరుకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని .. ఇలా బ్యాంకుల్ని మోసం చేశారన్న కారణంతో అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ పై వచ్చి బీజేపీలో చేరారు. ఆ మధ్య రాయపాటి కూడా బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కారణం ఏమిటో కానీ.. చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి.