హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థతో పాటు ఎన్ఎండీసీ ఐరన్ స్టీల్ ప్లాంట్, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కు చెందిన 8 అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రూ. 315 కోట్ల మోసం జరిగిందని సీబీఐ గుర్తించింది. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఏ ఒక్కటి అయినా నీతి, నిజాయితీ, విలువలతో చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. గనుల్లో ఎప్పడు .. ఏ వ్యాపారం కోసం వేలు పెట్టిందో కానీ.. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినట్లుగా కనిపిస్తోంది.
నిజానికి మేఘా కంపెనీ రేంజ్ ను చూస్తే.. రూ. 315 కోట్ల మోసం కేసు అనేది చాలా చిన్న మొత్తం. కాళేశ్వరం ప్రాజెక్టు తవ్వితే వేల కోట్ల అవినీతి వెలుగులోకి వస్తుందని అందరూ చెబుతూంటారు. మేఘా చేసేది ఒక్క కాళేశ్వరం మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్లతో ముడిపడి ఉన్న ప్రతీ ప్రాజెక్టు మెగా చేతుల్లోనే ఉంది. ఇలా వచ్చిన కాంట్రాక్టులతో.. రకరకాల వ్యాపారాలకు విస్తరించింది. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత.. ఈ కంపెనీ అసలు గుట్టు అంతా బయటకు వస్తుందని అనుకుంటున్నారు. ఇంకా ఈ లెక్కలు బయటకు రాలేదు.
ఎలక్టోరల్ బాండ్స్ లో రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చిన కంపెనీల్లో ఊరూపేరూ లేని గేమింగ్ కంపెనీ తర్వాతి స్థానం మేఘాదే. ఎప్పటికీ సమాచారం బయటకు రాదనుకుని అధికార పార్టీలు అయిన బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీలకు పెద్ద ఎత్తున విరాళాలిచ్చారు. వీటి వెనుక లోగుట్టేమిటో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు.. అనూహ్యంగా ఓ కేసులో సీబీఐ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. అక్కడ్నుంచి కంపెనీ వ్యవహారాలన్నీ తవ్వుకుంటూ వచ్చి .. అసలు టార్గెట్ రీచ్ అవుతారా లేకపోతే.. ఇదేమైనా బెదిరింపు కేసా అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.