ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు పధ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. శుక్రవారం కోర్టు పనిదినం చివరి గంటలో హాజరు చూపించడంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం లభించలేదు. రెండురోజుల పాటు ధూళిపాళ నరేంద్ర జైల్లోనే ఉంటారు. అయితే.. మొత్తం వ్యవహారంపై సీబీఐ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. అందులో ఉన్న సారాంశం మొత్తం చదివినా.. అసలు కేసేంటో.. నిర్దిష్టంగా తెలియని పరిస్థితి.
ధూళిపాళ్ల నరేంద్ర సంగం డైరీ చైర్మన్‌గా ఉన్నారు. చైర్మన్‌గా వ్యవహరిస్తూ డైరీ వ్యవహారాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ చెప్పుకొచ్చింది. అయితే ధూళిపాళ్ల నరేంద్రపై పెట్టిన కేసులేమిటో నిర్దిష్టంగా ఏసీబీ చెప్పలేదు. సంగం డెయిరీలో ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో అనేక ఆర్థిక, పాలనా పరమైన అవకతవకలు జరిగాయని ప్రకటనలో ఏసీబీ తెలిపింది. చైర్మన్‌గా ధూళిపాళ్ల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేశారని.. పదవిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని చెప్పింది. అయితే ఇవన్నీ జనరల్‌గా రాజకీయ పరంగా చేసే ఆరోపణల్లాగే ఉన్నాయి. నిర్దిష్టమైన కేసు ఏంటో చెప్పలేదు. ఫలనా చోట… అక్రమాలకు పాల్పడ్డారని.. ఫలానా మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని కానీ వివరాలు బయట పెట్టలేదు.
అయితే ఈ కేసుల్లో ఏ వన్‌గా ధూళిపాళ్ల నరేంద్రను.. ఏ టూగా డెయిరీ ఎండీ గోపాలకృష్ణను పెట్టారు. ఏ త్రీగా ఎం. గురునాథం అనే వ్యక్తిని చూపించారు. ఇతను గతంలో సహకార శాఖ రిజిస్ట్రార్‌గా చేశారు. సంగం డెయిరీని సహకార శాఖ నుంచి కంపెనీల చట్టంలోకి మార్చారు. ఆ సమయంలో రిజిస్ట్రార్‌గా ఉన్నందున… గుర్నాధంపై కేసు పెట్టారని భావిస్తున్నారు. అంటే ఈ అంశంపైనే కేసులు పెట్టి ఉంటారని అందుకే అతన్ని కూడా.. నిందితుడుగా చేర్చారని చెబుతున్నారు. అయితే ఈ అంశంపై గతంలోనే ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు.. హైకోర్టుకు వెళ్లి నరేంద్ర స్టే తెచ్చుకున్నారు. కేసు పెట్టడానికి సాధ్యంకాదు. మరి ఏసీబీ అధికారులు ఏ కేసులు పెట్టారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రెస్‌నోట్‌లో ఓ వివరణ కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. కానీ అందులో వివరాలేమీ లేకపోవడం గందరగోళానికి కారణం అయింది.
మరో వైపు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ… సంగం డెయిరీ ప్లాంట్‌లోని చైర్మన్ చాంబర్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయడానికి ప్రయత్నించారు. అయితే కార్మికులు అడ్డుకున్నారు. చైర్మన్ చాంబర్లోకి ఏసీబీ అధికారులు వెళ్లేందుకు కార్మికులు అంగీకరించలేదు. సోదాలకు కోర్టు ఆర్డర్ ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆర్డర్ లేకపోవడంతో ఏసీబీ అధికారులు కార్యాలయాన్నీ సీజ్ చేసి వెళ్లిపోయారు.