విశాఖ డాక్టర్ సుధాకర్ ఘటన విషయంలో సీబీఐ విచారణ పూర్తి చేసింది. ఈ నెల పదో తేదీనే సీల్డ్ కవర్లో రెండో రిపోర్టును హైకోర్టుకు సమర్పించినట్లుగా సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ కేసుపై మంగళవారం జరిగిన విచారణలో.. కేసు వివరాలు తెలియజేయాలని హైకోర్టు న్యాయవాదికి సూచించింది..అయితే కేసు సున్నితమైన అంశం కాబట్టి ఓపెన్ కోర్టులో బహిర్గతం చేయలేమన్న సీబీఐ న్యాయవాది చెప్పింది. దీంతో సీల్డ్ కవర్ను తమ ముందు ఉంచాలన్న ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణ బుధవారం జరగనుంది.
డాక్టర్ సుధాకర్ అరెస్ట్.. తదనంతర పరిణామాలపై రెండు నెలల పాటు చేసిన దర్యాప్తులో కుట్ర కోణం ఉందని.. గతంలో సీబీఐ గుర్తించింది. మొదట ఈ కేసు విచారణకు హైకోర్టు.. సీబీఐకి.. ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. ఈ లోపు దర్యాప్తు చేసిన సీబీఐ… మధ్యంతర నివేదికను… హైకోర్టుకు సమర్పించింది. కుట్రకోణం దాగి ఉందని.. మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని.. మరింత సమయం కావాలని అడిగింది. దీంతో హైకోర్టు మరో నెల సమయం ఇస్తూ.. నిర్ణయం తీసుకుంది. నవంబర్ 11న పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం..నవంబర్ పదో తేదీన రెండో రిపోర్టును సమర్పించిది.
డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్థిషియా వైద్యునిగా పనిచేస్తున్నారు. ఓ సందర్భంలో ప్రభుత్వం సరైన రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని… మాస్కులు ఇవ్వలేదని మీడియా ముందు చెప్పడంతో తర్వాత ఆయనను సస్పెండ్ చేశారు. అప్పుడు వైద్యుడు చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. మీడియాలోనూ హైలెట్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు… విశాఖలో ఓ రోడ్డుపై అర్థనగ్నంగా పోలీసులు కొట్టుకుంటూ సుధాకర్ ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు వెలుగు చూశాయి. అనూహ్యంగా ఆయనను మానసిక ఆస్పత్రికి తరలించి.. పిచ్చివాడనే ముద్రవేయడానికి ప్రయత్నం జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. చాలా రోజుల పాటు సుధాకర్ ను ఆస్పత్రిలోనే నిర్బంధించారు. చివరికి ఈ ఘటనలో.. డాక్టర్ సుధాకర్ కు.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓ వైద్యుడి విషయంలో ఇలా వ్యవహరించడం వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానిస్తూ… సీబీఐ విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. కుట్ర ఉందని సీబీఐ అంచనా వేయడంతో… సీల్డ్ కవర్లో ఆ కుట్ర తాలూకా నిజాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.