అక్రమ మైనింగ్ కారణంగా సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న గాలి జనార్దన్ రెడ్డి కోర్టు అనుమతిస్తే తప్ప బళ్లారికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. బెయిల్ షరతుల్లో ఆయన బళ్లారి వెళ్లకూడదని ఉండటమేదీనికి కారణం. ఎప్పుడైనా వెళ్లాలి అనుకుంటే ఆయన కోర్టు అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ఈ కారణంగా ఆయన తనకు బెయిల్ షరతులు సడలించాలంటూ అనేక సార్లు కోర్టుల్ని ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. మరోసారి సుప్రీంకోర్టులో అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే సీబీఐ మాత్రం చాలా గట్టిగా బెయిల్ షరతులను సడలించవద్దని కోరుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దని వాదిస్తోంది.
అలా చేయడం వల్ల గాలి జనార్దన్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేస్తారని .. బళ్లారి ప్రజలను భయపెడతారని అంటోంది. నిజానికి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నేత. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంది. కేవలం ఆయన బెయిల్ షరతుల సడలింపు మాత్రమే కోరుతున్నారు. అయినప్పటికీ… సీబీఐ కనీసం ఆయనకు అనుకూలంగా ఒక్క మాట చెప్పడంలేదు. అనుకూలం సంగతి తర్వాత కనీసం.. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిల విషయంలో వ్యవహరిస్తున్నట్లుగా ఏ అభిప్రాయం లేదని మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పడం లేదు. చాలా కఠినంగా… కేసును గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన సహ నిందితులు ప్రభావితం చేస్తున్నారన్నట్లుగా వాదిస్తోంది.
దీంతో ఆయనకు ఏ కోర్టులో అయినా బళ్లారికి ఎలాంటి ఆంక్షలు లేకుండా వెళ్లడానికి అవకాశం లేకుండా పోతోంది. బళ్లారిలో సామ్రాజాన్ని ఏర్పాటు చేసుకుని రాజకీయాన్ని ఏలిన గాలి జనార్దన్ రెడ్డికి.. చాలా కాలంగా సొంత ఊరికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. సీబీఐ కారణంగా ఇప్పుడు కూడా అవకాశం దక్కడం లేదు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలపై సీబీఐకి ఉన్న సాప్ట్ కార్నర్ .. గాలి జనార్దన్ రెడ్డిపై ఎందుకు లేదోనన్న సెటైర్లు కర్ణాటకలో వినిపిస్తున్నాయి.