సీబీఐ అధికారులు ఏపీలోని కొన్ని కీలకమైన కేసుల్లో మొహమాటాలు పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇంత కాలం చేస్తున్నారా లేదా అన్నట్లుగా దర్యాప్తులు చేస్తున్న కేసుల్లో ఒక్క సారిగా వేగం పెంచారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల వద్దరు చేరే కేసుల్లో ఈ దూకుడు ఎక్కువగా ఉండటం అధికార పార్టీ నేతల్ని కూడా విస్మయానికి గురి చేస్తోంది. న్యాయమూర్తులపై దూషణల కేసుల్లో సీబీఐ ఇంత కాలం పట్టీ పట్టనట్లుగా ఉంటూ వచ్చింది. కానీ గత రెండు వారాలుగా పరిస్థితి మారిపోయింది. కేసును వైసీపీ పెద్దల వద్దకు చేరే అన్ని ఆధారాలను పట్టుకునేందుకు సోదాలు ముమ్మరం చేసింది.
ఆ దిశగా కీలక అడుగులు వేసింది. సుమన్ టీవీకి న్యాయన్యవస్థను దూషిస్తూ ఇంటర్యూలు ఇచ్చిన వ్యవహారంలో సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆయనను సీబీఐ ఏ క్షణమైనా అదుపులోకి తీసుకోవచ్చని చెబుతున్నారు. గతంలో జగన్ బెయిల్ విషయంలోనూ ఆయన తీరు వివాదాస్పదమయింది. ఈ కేసులో ముందు ముందు చాలా సంచలనాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. తాజాగా వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇంత కాలం విచారణ జరిపినా విషయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి వద్దకు తీసుకెళ్లడానికి మొహమాటపడ్డారు. వివేకా హత్య కేసులు చేధించదల్చుకుంటే రెండు రోజుల పని అని కడప జిల్లాలో ఎస్ఐకి కూడా తెలుసు. కానీ వివిధ కారణాలతో సీబీఐ అధికారులు మొహమాటానికి పోతున్నారు.
అయితే సీబీఐ అధికారుల్నే భయపెట్టే పరిస్థితికి నిందితులు రావడంతో ఇప్పుడు సీబీఐ అధికారులు తమ శైలిలో విచారణ ప్రారంభించారు. తాజాగా వెలుగులోకి వచ్చినా చార్జిషీట్ ప్రకారం అవినాష్ రెడ్డే ప్రధాన నిందితుడిగా తేల్చినట్లుగా కనిపిస్తోంది. అటు జడ్జిలపై దూషణలు కేసులు.. ఇటు వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల దూకుడు ఏపీ అధికార పార్టీ పెద్దల మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం మాత్రం అప్పుడే వినిపిస్తోంది.