న్యాయమూర్తులపై దూషణలు, హెచ్చరికల కేసును సీబీఐకి హైకోర్టు ఇచ్చి చాలా కాలం అయింది. ఎప్పటికప్పుడు నాన్చుతూనే ఉంది. కానీ ఏమీ చేయలేకపోయింది. నిజానికి డిజిటల్ ఆధారాలు చాలా పక్కాగా ఉండే ఇలాంటి వాటిలో నిందితుల్ని క్షణాల్లో అరెస్ట్ చేయగలరు. ఇటీవల ఏపీ సీఎంను మానవ బాంబుగా మారి చంపేస్తానని ఓ జనసేన కార్యకర్త ఫేక్ అకౌంట్ తో ట్వీట్ పెట్టి.. క్షణాల్లో డిలీట్ చేస్తే ఏపీ సీఐడీ పోలీసులు గంటల్లో అరెస్ట్ చేసి పట్టుకొచ్చి .. ముఖానికి ముసుగేసి మీడియా ముందు నిలబెట్టారు. సీఐడీనే అంత వేగంగా ఉంటే సీబీఐ ఇంకెంత వేగంగా ఉండాలి..?.
కానీ సీబీఐ పైపైన అరెస్టులు చేస్తూ టైం పాస్ చేస్తూ వస్తోంది. కొంత మందిని అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు వెదుక్కుంటోంది. అయితే హఠాత్తుగా సీబీఐ అధికారులు విరుచుకుపడ్డారు. హిందూపురంలో ఓ మున్సిపల్ కౌన్సిలర్‌తో పాటు ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌లోనూ సోదాలు చేశారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి చేతుల్లో ఉన్న డిజిటల్ కార్పొరేషన్ బహిరంగంగా వైసీపీకి ప్రచారం చేస్తుంది. ప్రభుత్వ సొమ్ముతో వైసీపీకి ప్రచారం చేసే విభాగం. అక్కడ వివిధ రకాల టూల్స్‌తో కొన్ని వందలు, వేల సోషల్ మీడియా అకౌంట్స్ నడుపుతూ ఉంటారు. సానుభూతిపరులకు సమాచారం పంపుతూ ఉంటారు. హఠాత్తుగా సీబీఐ అక్కడ రెయిడ్ చేసి కొన్ని ఆధారాలు సేకరించింది.
మరికొంత మందిని అదుపులోకి తీసుకుంది. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. న్యాయవ్యవస్థపై వ్యవస్థీకృతంగా దాడి జరిగిందని ఎవరికైనా తెలుస్తుంది. ఆ దాడికి మూలం ఎక్కడో కనిపెడితే మొత్తం నేరం తెలిసిపోతుంది. ఇప్పటి వరకూ సీబీఐ ఆ పని చేయలేదు. కానీ ఇప్పుడు ప్రారంభించినట్లుగా ఉంది. ప్రారంభించిన పనిని సీబీఐ సీరియస్‌గా పూర్తి చేస్తే అతి పెద్ద సోషల్ మీడియా మాఫియా వెలుగులోకి రావడం ఖాయమన్న అభిప్రాయం ఉంది. మరి సీబీఐ ఆ పని చేయగలదా ?