వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమయింది. సీబీఐ బృందం కడపకు చేరుకుని ఎస్పీ అన్బురాజన్‌తో సమావేశం అయింది. కేసు పూర్వాపరాలను తెలుసుకుంది. రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకుని.. క్షేత్ర స్థాయిలో పర్యటన జరిపి.. విచారణ చేపట్టనుంది. 2019 మార్చి 15వ తేదీన వైఎస్ వివేకా హత్య జరిగింది. ఆ సమయంలో ఎన్నికలు ఉండటంతో.. రాజకీయంగా దుమారం రేగింది. ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. సీబీఐకి ఇవ్వాలని కోరారు. సీఎం అయిన తర్వాత విచారణ అధికారుల్ని పదే పదే మార్చడంతో.. విచారణ ముందుకు సాగలేదు. పోలీసులు కొన్నివేల మందిని అనుమానితులుగా చెప్పడం ప్రారంభించారు.
ప్రభుత్వం తీరుపై అసహనానికి గురైన.. వైఎస్ వివేకా కుమార్తె.. సునీత.. సీబీఐ ద్వారా విచారణ చేయించాలని.. హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే.. అసలు నిందితుల్ని వదిలి పెట్టి అమాయకుల్ని ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ.. ఇతరులు కూడా.. పిటిషన్లు వేశారు. వీటిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు.. ఈ ఏడాది మార్చి పదకొండో తేదీన సీబీఐకి అప్పగిస్తూ.. తీర్పు వెలువరించింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. సీబీఐ విచారణ కావాలన్న జగన్మోహన్ రెడ్డి.. తర్వాత ఆ పిటిషన్ ఉపసంహరించుకోవడం.. ఈ వ్యవహారంలో మొత్తం ట్విస్ట్. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే.. చంద్రబాబే వైఎస్ వివేకాను చంపించారని జగన్ ఆరోపించారు. అయితే.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు ఎటూ తేలలేదు.
కేసులో వీలైనంత వరకూ కాలయాపన చేయాడనికే సిట్లను.. విచారణ అధికారులను జగన్ ప్రభుత్వం మార్చిందనే ఆరోపణలు ఉన్నాయి. క్రైమ్ రూల్స్ ప్రకారం.. సాక్ష్యాలు తుడిచేయడానికి ప్రయత్నించిన వారికి.. అసలు నిజమేంటో తెలుస్తుంది. కానీ పోలీసులు..పదిహేను వందల మందిని అనుమానితులుగా పేర్కొన్నారు.. కేసును చేధించే ప్రయత్నం చేయలేదు. పోలీసులు చేధించిన ఇతర కేసులతో పోలిస్తే.. వివేకా హత్య కేసు చాలా సులువైనదని.. ఎవరికైనా అర్థమవుతుంది. కరోనా కారణంగా.. సీబీఐ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత చాలా ఆలస్యంగా విచారణ ప్రారంభిస్తోంది. వివేకా కుటుంబానికి న్యాయం జరుగుతుందో.. లేకపోతే.. ఈ సింపుల్ కేసు.. ఇలా మిస్టరీగా ఉండిపోతోందో వేచి చూడాలి.. !