వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సీరియల్‌ను కొనసాగించేందుకు సీబీఐ అధికారుల బృందం మరోసారి పులివెందులకు చేరుకుంది. గతంలో రెండు విడతలుగా పులివెందులకు వచ్చినప్పటికీ.. ఆ బృందానికి కరోనా సోకడంతో అంతా ఢిల్లీ వెళ్లిపోయారు. ఆ తర్వాత మరో కొత్త టీంకు బాధ్యతలు అప్పగించినప్పటికీ.. వారు వచ్చి కేసును టేకప్ చేయడానికి ఇంత కాలం పట్టింది. వివేకా హత్య కేసుకు సంబంధించిన డీటైల్స్ ఇవ్వడానికి గతంలో పులివెందుల కోర్టు నిరాకరించింది. దాంతో వారు హైకోర్టులో పిటిషన్ వేసి అనుకూలమైన తీర్పు తెచ్చుకున్నారు. కోర్టులో ఉన్న రికార్డులన్నీ.. సీబీఐ అధికారులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.
దీంతో పులివెందుల చేరుకున్న కొత్త సీబీఐ బృందం ఇప్పుడు.. ఆ రికార్డులను స్వాధీనం చేసుకుంది. విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో విచారణ జరిపిన బృందం పెద్దగా ఎవర్నీ ప్రశ్నించలేదు. ఈ కేసులో ప్రధానంగా సాక్ష్యాలు మాయం చేయడానికి ప్రయత్నించిన వారిపై దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే సీబీఐ అధికారులతో గతంలో రకరకాల కోణాల్లో విచారణ జరిపారు. ఓ చెప్పుల దుకాణం.. మరో వ్యాపారి.. సన్నిహితుడు.. అంటూ రకరకాల ప్రచారాలు మీడియాలో జరిగాయి కానీ అసలేం జరిగిందో మాత్రం క్లారిటీ రాకుండా పోయింది.
ఇప్పుడు కొత్త బృందం అయినా వైఎస్ వివేకా హత్య కేసును చేధిస్తుందా లేకపోతే.. గత బృందాల్లాగే టైం పాస్ చేసి వెళ్లిపోతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ కేసు మెరిట్‌ను బట్టి చూస్తే.. .సాధారణ ఎస్ఐ నిందితుల్ని మూడు రోజుల్లోనే పట్టుకోగలరని.. అపరాధపరిశోధనల్లో రాటుదేలిపోయిన నిపుణులు చెబుతున్నారు. కానీ కారణాలేమిటో కానీ…అప్పట్లో పోలీసులు కానీ.. ప్రభుత్వం నియమించిన సిట్లు కానీ.. చివరికి సీబీఐ అధికారులు కూడా.. ఏమీ తేల్చలేకపోతున్నారు. నాన్చుతున్నారు.