నీతినిజాయితీలకు మారు పేరంటూ… కొద్ది రోజుల క్రితం.. ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారారు.. చంద్రకళ అనే ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారి. ఏ మాత్రం క్వాలిటీ లేని ఇటుకల్ని పగులకొడుతూ.. అధికారులపై ఆమె విరుచుకుపడుతున్న తీరు చూసి.. తెలుగు బిడ్డ.. తెలంగాణ బిడ్డ అంటూ.. అందరూ లైకులు , షేర్లు హోరెత్తించారు. ఇప్పుడు ఆమె వేరే రకంగా వార్తల్లోకి వచ్చింది. చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు జరుగుతున్నాయి. అదీ కూడా అవినీతి ఆరోపణలపై. ఇసుక మాఫియాతో పాటు మైనింగ్ మాఫియాతో చంద్రకళకు సంబంధాలున్నట్లు… ఆరోపణలు వచ్చాయి. ఆమె కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారనే ఆధారాలతో సహా ఆమెపై అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసి ఏకకాలంలో 12 చోట్ల దాడులకు దిగింది.
జలౌన్, హమీర్ పూర్, లక్నో, ఢిల్లీ ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. సీబీఐ సోదాల్లో విలువైన డాక్యుమెంటు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆమె బ్యాంకు లాకర్లను తెరిచి చూస్తున్నారు. చంద్రకళ స్వస్థలం కరీంనగర్ జిల్లా … యూపీతోపాటు కరీంనగర్ జిల్లాలోనూ సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం.. ఇంటర్నెట్ లో ఓ వీడియో హల్ చల్ చేసింది. రహదారి పనుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్లను స్కూల్ పిల్లల్లా వరుసలో నిలబెట్టి మరీ క్లాస్ తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో ఇప్పటి వరకూ 6లక్షల మంది వీక్షించారు. దీంతో ఆమె ఒక్కసారిగా జాతీయస్థాయి వార్తల్లో నిలిచారు.
గోదావరి ఖనికి చెందిన ఆమె తొలుత గ్రూపు వన్ అధికారిణిగా హైదరాబాద్‌లోని సహకార సంఘం హెడ్ ఆఫీస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత సివిల్స్ రాసి 2008లో ఎంపికయ్యారు. ఆమెను యూపీ క్యాడర్ కు కేటాయించారు. సోషల్ మీడియాలో నిజాయితీ పరులారిగా ఇమేజ్ తెచ్చుకుని ఇలా ఆరోపణల వలయంలో చిక్కుకున్నారు. సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు.