రెండు దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న అంతర్జాతీయ క్రిమినల్, మాఫియా డాన్ ఛోటా రాజన్ పదిరోజుల క్రితం ఇండోనేషియాలోని బాలిలో పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందే. అతనిని ఈరోజు భారత్ కి తిరిగి తీసుకురాబోతున్నట్లు డిల్లీలో అధికారులు తెలిపారు. అతనిని బాలి నుంచి మొదట డిల్లీకి తీసుకువస్తారు. పాస్ పోర్ట్ ఫోర్జరీ కేసులో అతనిని సిబీఐ అధికారులు ప్రశ్నిస్తారు. వారి విచారణ ముగిసిన తరువాత అతనిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీస్ అధికారులకు అప్పగిస్తారు. వారు అతనిని ముంబై తరలిస్తారు. అతనిపై సుమారు 70కి పైగా కేసులు ఉన్నాయి. వాటిలో తీవ్రమయిన నేరాలకు పాల్పడినవి చాలా కేసులున్నాయి. అతని కోసం ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు గత రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్ళకి అతను వారి చేతికి చిక్కబోతున్నాడు.
సిబీఐ, ముంబై క్రైం బ్రాంచ్ పోలీస్, డిల్లీ స్పెషల్ పోలీస్ అధికారులు ప్రస్తుతం బాలిలోనే ఉన్నారు. అతనిని భారత్ తీసుకురావడానికి అవసరమయిన అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసి ఇండోనేషియా ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. బహుశః ఇవ్వాళ్ళ సాయంత్రంలోగా అతనిని డిల్లీకి తీసుకువచ్చే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. అతను మొదట్లో దావూద్ ఇబ్రహీం వద్ద పనిచేసేవాడు. 1993లో ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళ తరువాత దావూద్ నుండి విడిపోయి స్వంతంగా నేర సామ్రాజ్యాన్ని స్థాపించుకొన్నాడు. అప్పటి నుండి ఆ రెండు గ్రూపులు చాలా సార్లు పరస్పర దాడులు చేసుకొన్నారు. ఛోటా రాజన్ న్ని హతమార్చేందుకు దావూద్ గ్యాంగ్ చాలాసార్లు ప్రయత్నించింది కానీ రాజన్ తప్పించుకోగలిగాడు. అందుకే అతను మొదట భారత్ వచ్చేందుకు నిరాకరించాడు. కానీ తరువాత ఏమయిందో గానీ తను ఎవరికీ భయపడబోనని భారత్ రావడానికి తనకేమీ భయం, అభ్యంతరాలు లేవని చెప్పడంతో భారత్ అధికారుల పని సులువయిపోయింది.