ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కవిత తప్పించుుకోలేని విధంగా పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే అరెస్టయిన నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ సీబీఐ కోర్టు… పక్కాగా సాక్ష్యాలున్నాయని బెయిల్ కు అర్హులు కారని స్పష్టం చేసింది. ఈ తీర్పులో కొన్ని సార్లు కవిత ప్రస్తావన వచ్చింది. కవితను ఇంకా సీబీఐ, ఈడీ నిందితురాలిగా చూపించేలేదు. కానీ ఆమె పేరు మాత్రం చాలా సార్లు ప్రస్తావించింది.. డిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఆమె బినామీ భాగస్వామి అని స్పష్టం చేసింది.మరో వైపు లిక్కర్ కేసు మెల్లగా కవిత వద్దకే వస్తున్నట్లుగా పరిణామాలు మారుతున్నాయి.
ఒక్కొక్కరిగా అరెస్టు చేసుకుంటూ వెళ్తున్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఇప్పటి వరకూ అరెస్టు చేసిన వారికి బెయిల్ కూడా రావడం లేదు. నెలల తరబడి జైళ్లలోనే ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ ఎంపీల బంధువులు అయిన శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డిలను అరెస్ట్ చేశారు. అలాగే బోయినపల్లి అభిషేక్, ఆడిటర్ బుచ్చిబాబులను అరెస్ట్ చేశారు. సౌత్ లాబీ లింకులన్నీ కవిత దగ్గరకే చేరుతున్నాయన్న ప్రచారం గుప్పు మంటోంది. ఇప్పటికే కవితను ఓ సారి విచారించారు. మరో సారి విచారణకు పిలుస్తామని నోటీసులు ఇచ్చారు. దీంతో ఎప్పుడైనా కవితను విచారణకు పిలువవచ్చన్న ప్రచారం ప్రారంభమయింది.
ఈ లిక్కర్ స్కాం వ్యవహారంలో రామంచంద్రన్ పిళ్లై కీలకం. ఇంత వరకూ ఆయనను సీబీఐ అరెస్ట్ చేయకపోవడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన అప్రూవర్‌గా మారారని అన్ని విషయాలు చెబుతున్నారని.. ఆయన వివరాలతోనే దాడులు చేస్తున్నారని అంటున్నారు. అదే నిజం అయితే కవిత ఇంకా ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లే చెబుతున్నారు. విశేషం ఏమిటంటే.. బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు చెప్పే క్రమంలో… న్యాయమూర్తి తీవ్ర మైన ఆర్థిక నేరాలంటూ.. జగన్ కేసుల్నీ ప్రస్తావించారు.