ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కి సిబిఐ నిన్న సమన్లు జారీ చేసింది. ఆయన తన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని కలిసి, తన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు. అందుకోసం ఆయన ఆ ఎమ్మెల్యేకి రూ. 2.5 కోట్లు లంచం, మంత్రి పదవి ఆశజూపారు. అందుకు ఆ ఎమ్మెల్యే ఒప్పుకోకపోవడంతో రావత్ రూ. 10 కోట్లు ఆఫర్ చేసారు. ఆ ఎమ్మెల్యేతో రావత్ చేసిన ఆ బేరసారాలను “సమాచార్ ప్లస్’ అనే టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా చిత్రీకరించి బయటపెట్టింది.
హరీష్ రావత్ ప్రభుత్వాన్ని ఏవిధంగానయినా అడ్డు తొలగించుకొందామని ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అదొక మంచి అవకాశంగా దొరకడంతో వెంటనే సిబిఐని రంగంలోకి దించింది. ఆ వీడియో అసలయినదేనని దృవీకరించుకొన్న తరువాత కేంద్రం అనుమతితో కేసు నమోదు చేసి ప్రాధమిక దర్యాప్తు మొదలుపెట్టింది. ఆ కేసులో ప్రశ్నించేందుకు హరీష్ రావత్ ని సోమవారం తమ ముందు హాజరు కావలసిందిగా కోరుతూ నోటీసు పంపింది.
హైకోర్టు, సుప్రీం కోర్టు రెండూ కూడా శాసనసభలో బలనిరూపణకు హరీష్ రావత్ కి అవకాశం కల్పించడానికి సానుకూలత వ్యక్తం చేస్తున్న సమయంలో ఆయన మెడకి ఈ సిబిఐ కేసు చుట్టుకోవడంతో ఇక ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోల్పోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆ ఉద్దేశ్యంతోనే సిబిఐని ఆయనపైకి ఉసి గొల్పిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా విమర్శించారు. దేశంలో భాజపా ప్రభుత్వాలు తప్ప మరొకటి ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తునట్లుందని ఆయన అన్నారు.