ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని దాఖలు చేసుకున్న పిటిషన్ను ఉపసంహరించుకవాలనుకున్న జగన్ నిర్ణయం రివర్స్ అయినట్లుగా కనిపిస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ.. హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల్లో జగన్ పిటిషన్ ఉపసంహరణ ప్రభావం…పోలీసులపై ఉండకూడదని హైకోర్టు పేర్కొంది. ఇప్పటి వరకూ ప్రత్యేక దర్యాప్తు బృందం చేిసన దర్యాప్తు వివరాలను.. రెండు సీల్డ్ కవర్లలో హైకోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన హైకోర్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు.. జగన్తో పాటు వివేకా భార్య సౌభాగ్యమ్మ కూడా సీబీఐ దర్యాప్తు కోసం పిటిషన్ వేశారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు ఎటూ తేలలేదు. దీంతో వివేకా కుమార్తె సునీత కూడా సీబీఐ దర్యాప్తు కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో వివేకా అల్లుడు కూడా భాగస్వామి. ఇక ఈ హత్య కేసులో రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికిస్తున్నారంటూ.. బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి కూడా విడివిడిగా పిటిషన్లు వేశారు. వీరందరి వాదనలు విన్న హైకోర్టు… చివరికి సీబీఐ దర్యాప్తు వైపే మొగ్గు చూపింది. పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచే సీబీఐ దర్యాప్తు ప్రారంభం కావాలని హైకోర్టు ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. హత్య జరిగి ఏడాదవుతున్నా దర్యాప్తులో పురోగతి లేదని.. కేసు దర్యాప్తులో సమయం కీలకం కాబట్టి సీబీఐకి అప్పగిస్తున్నామని హైకోర్టు తెలిపింది. సీఎం జగన్ పిటిషన్ ఉపసంహరణ ప్రభావం దర్యాప్తుపై ఉండకూడదని స్పష్టం చేసింది.
కేసులో వీలైనంత వరకూ కాలయాపన చేయాడనికే సిట్లను.. విచారణ అధికారులను మార్చిందనే ఆరోపణలు ఉన్నాయి. క్రైమ్ రూల్స్ ప్రకారం.. సాక్ష్యాలు తుడిచేయడానికి ప్రయత్నించిన వారికి.. అసలు నిజమేంటో తెలుస్తుంది. కానీ పోలీసులు..పదిహేను వందల మందిని అనుమానితులుగా పేర్కొన్నారు.. కేసును చేధించే ప్రయత్నం చేయలేదు. పోలీసులు చేధించిన ఇతర కేసులతో పోలిస్తే.. వివేకా హత్య కేసు చాలా సులువైనదని.. ఎవరికైనా అర్థమవుతుంది. సీబీఐ ఈ కేసును ఎన్నాళ్లకు తేలుస్తుందో చూడాలి..!