వివేకానందరెడ్డి హత్య కేసులో త్వరలోనే మరికొంత మంది కీలక నేతల్ని అరెస్టు చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. శుక్రవారం అరెస్ట్ చేసిన ఉదయ్ కుమార్ రెడ్డిని కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అసలు మొత్తం కథను సీబీఐ వివరించింది. నిజానికి గతం కన్నా ఈ సారి మరితం సూటిగా.. స్పష్టంగా సీబీఐ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు.
వివేకానంద రెడ్డి హత్య జరుగుతుందని అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు ముందే తెలుసని.. హత్య సమాచారం కోసం వారు ఎదురు చూస్తూ అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారన్నారు. వివేకా హత్య జరిగిన తర్వాత వీరికి సమాచారం రాగానే వీరు వెళ్లి సాక్ష్యాలను తారుమారు చేశారని సీబీఐ స్పష్టం చేసింది. గూగుల్ టేక్ అవుట్లో లొకేషన్‌కి సంబంధించిన ఆధారాలు లభించినట్టు పేర్కొంది.
హత్య తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రి ప్రకాష్ రెడ్డితో వివేక మృతదేహానికి కుట్లు వేయించారని.. అవినాష్ రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడని సీబీఐ స్పష్టం చేసింది. బాత్రూం నుండి డెడ్ బాడీని బెడ్ రూమ్ కి ఉదయ్ కుమార్ తీసుకువచ్చాడని .. వివేక తలకున్న గాయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. వివేకానంద రెడ్డి గుండెపోటు అనే చిత్రీకరించడంలో వీరి పాత్ర చాలా కీలకంగా ఉందని సీబీఐ స్పష్టం చేసింది.
పలుమార్లు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించిన తమ విచారణకు సహకరించడం లేదని.. పారిపోతాడనేటువంటి అనుమానంతో ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశామని సీబీై తెలిపింది. ఇంకా ఈ కేసులో విచారణ చేస్తున్నామని.. మరి కొంతమందిని కూడా అరెస్టు చేస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ ప్రకటించిన వివరాల ప్రకారం… అవినాష్ రెడ్డిని కూడా ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.