సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అంటే… అత్యంత తీవ్రమైన నేరాలను క్షణ్ణంగా పరిశోధించి.. నిజాలను నిగ్గు తేల్చి.. నిందితుల్ని శిక్షించే గొప్ప సంస్థ అనే భావన ఇప్పుడు ఎవరికీ లేదు. సినిమాల్లో ఒకప్పుడు అలా చూపించినా ఇప్పుడు మాత్రం అది ఫక్తు రాజకీయ అనుబంధ సంస్థగా మారిపోయింది. అధికారంలో ఉన్న పార్టీకి ఊడిగం చేయడానికి ఎవరిపై ఉసిగొల్పితే వారిపై దాడులు చేయడం.. కేసులు పెట్టడం.. అరెస్టులు చేయడం కామన్ అయిపోయింది. దీనికితోడు అదనంగా ఇప్పుడు… అధికార పార్టీలోని వారికి.. వారికి కావాల్సిన వారిపై ఉన్న కేసుల్ని అసలు పట్టించుకోకుండా పక్కన పడేయడంలోనూ సీబీఐ తనదైన ప్రత్యేకత చూపిస్తోంది. రాజకీయంగా కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి ఉపయోగపడే అంశం అయితే అఘమేఘాల మీద ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగిపోతుంది. అదే అధికార పార్టీకి దగ్గరైన వారి కేసులయితే… పక్కా సాక్ష్యాలు కళ్లముందున్నా.. ఆ.. అది మామూలే అని బాధితులతోనే అనగలిగే చాతుర్యాన్ని సీబీఐ సంపాదించుకుంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ అనే ఐపీఎస్ అధికారి.. తనను ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుంచితొలగించగానే అక్కడి హోంమంత్రిపై నెలకు రూ. వంద కోట్లు వసూలు చేయమన్నారన్న ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేయాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఇలా హైకోర్టు ఆదేశించగానే అలా సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఉన్న రాజకీయ అంశాలపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని గురి పెట్టి.. కేంద్ర దర్యాప్తు సంస్థలయిన ఎన్ఐఏ.. సీబీఐతో.. బీజేపీ గేమ్ ఆడుతోందన్న ప్రచారం ఉంది. ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగింది.హైకోర్టు ఆదేశించింది కాబట్టి ఎంత వేగంగా స్పందించినా తప్పు లేదు.. కానీ ఇతర కేసుల్లో అదే సీబీఐ వ్యవహరిస్తున్న తీరే అనుమానాస్పదం.
మాజీ ముఖ్యమంత్రి సోదరుడు… అనేక సార్లు ఎంపీగా.. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. హై ప్రోఫైల్ పొలిటిషియన్ అయిన వైఎస్ వివేకానందరెడ్డి సొంత ఇంట్లో దారుణంగా హత్య చేస్తే.. ఆ కేసును సీబీఐ తేల్చలేదు. హైకోర్టు ఆదేశించినా ముక్కుతూ.. మూలుగుతూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడైతే పూర్తిగా ఆగిపోయింది. న్యాయం చేయాలని వెళ్లిన .. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కడపలో హత్యలు మామూలేనని సమాధానపర్చేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించారట. అంటే. . సీబీఐ ఎంత దారుణంగా.. రాజకీయ అవసరాల కోసం టూల్గా ఉపయోగపడుతుందో సులువుగా అర్థం చేసుకోవచ్చు. హత్యలు మామూలేనని.. ఏ సీబీఐ అధికారి అయినా అన్నాడంటే.. అతనికి ఉద్యోగంలో ఉండే అర్హత ఎలా ఉంటుంది..? కానీ అతను అలా అనడానికి ఎలాంటి పరిస్థితులు ప్రేరేపించాయో కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది.
ఒక్క వివేకా కేసు మాత్రమే కాదు.. బెంగాల్లో శారదా స్కాం పేరుతో పెట్టిన సీబీఐ కేసుల్లో నిందితులందరూ ఇప్పుడు బీజేపీలో చేరారు. వారిపై చర్యలుండవు. ఆర్థికనేరాలకు పాల్పడి.. వేల కోట్ల స్కాం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు కం బిజినెస్ మెన్లందరూ ఇప్పుడూ బీజేపీలోనే ఉన్నారు. వారిపై సీబీఐ కేసులున్నాయి. కానీ పట్టించుకోరు. అంత ఎందుకు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఏళ్ల తరబడి అలా ఉండిపోయాయి. కానీ ముందుకు నడవడం లేదు. దేశంలో వ్యవస్థలు ఇలా రాజకీయ వ్యవస్థ చేతిలో బందీలైతే.. దేశానికి నియంతృత్వమే మిగులుతుంది తప్ప.. ప్రజాస్వామ్యం కాదు..!