వివేకా హత్య కేసులో దూకుడుగా విచారణ జరుపుతున్న సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై కడప పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసు పెట్టడం సంచలనంగా మారింది. దర్యాప్తు అధికారిపై కేసు పెట్టడం అంటే బరి తెగించడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ కోర్టు ఆదేశించింది అని చెబుతున్నప్పటికీ .. సీబీఐ అధికారులపై కేసులు పెట్టాలన్న లక్ష్యంతోనే కొంత కాలంగా వైఎస్ వివేకా హత్య కేసు అనుమానితులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని జరిగిన.. జరుగుతున్న ఘటనలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
వివేకా హత్య కేసు దర్యాప్తు క్లైమాక్స్‌కు వచ్చినట్లుగా కనిపిస్తోంది. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలాలన్నీ అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. దీంతో ఎప్పుడైనా ఆయన కుటుంబాన్ని అరెస్ట్ చేయవచ్చనన్న ప్రచారం జరుగుతోంది. అయితే సీబీఐ ఎంత దూకుడుగా ఉంటే.. ఏపీ పోలీసులు కూడా అంతే దూకుడుగా ఉంటారన్న సంకేతాలను ఇప్పటికే పంపారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే అంత కంటే ముందే సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది.
సీబీఐ విషయంలో ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న విధానం.. కుట్ర పూరితంగా తీసుకుంటున్న చర్యలు సీబీఐ ఉన్నతాధికారుల్లోనూ చర్చలకు కారణం అవుతున్నారు. ప్రభుత్వ పెద్ద ప్రమేయం లేకపోతే పోలీసులు ఇలా వ్యవహరించే అవకాశం లేదని వారు ఓ అంచనాకు వస్తున్నారు. దర్యాప్తు అధికారులపై ఇలాంటి కేసులకు దిగితే సీబీఐ చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. అది తమ అస్థిత్వానికి వచ్చే సమస్యగా భావిస్తుంది. ఈ కారణం గా తమ అధికారులపై నమోదు చేస్తున్న కేసులను అంత తేలికగా తీసుకునే అవకాశం లేదని.. ఖచ్చితంగా ప్రతి చర్య గట్టిగానే ఉంటుందని కొంత మంది అంచనా వేస్తున్నారు. ముందు ముందు సీబీఐ వర్సెస్ ఏపీ పోలీస్ అనే వార్ చాలా గట్టిగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.