వైెస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి భద్రతపై సీబీఐ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రెండు ప్రత్యేక సీబీఐ బృందాలు ప్రస్తుతం పులివెందులలోనే మకాం వేశాయి. సుప్రీంకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ కొట్టి వేసిన వెంటనే హైదరాబాద్ నివాసం నుంచి వెళ్లిపోయిన అవినాష్ రెడ్డి మళ్లీ మంగళవారం మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్నారు. ఆయన పరారయ్యారని అనుకుంటారమో కానీ పులివెందులకు వస్తారని ముందుగానే మీడియాకు సమాచారం ఇచ్చారు. అప్పటికే రెండు సీబీఐ బృందాలు పులివెందులకు చేరుకున్నాయి.
ఆదివారమే సీబీఐ బృందం వైఎస్ వివేకా ఇంట్లో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా దగ్గర మరిన్ని వివరాలు తీసుకున్నారు. అవినాష్ రెడ్డి ఇల్లు, వివేకా ఇంటిని పరిశీలించారు. టెక్నికల్ గా తమ దగ్గర ఉన్న ఆధారాలు నిజమేనని.. అవినాష్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని నిరూపించేలా కొన్ని సాంకేతిక అంశాలను సిద్ధం చేసుకున్నారు. మరో వైపు అవినాష్ రెడ్డి అరెస్ట్ తర్వాత అప్రూవర్ గా మారిన దస్తగిరి కి ముప్పు ఉంటుందన్న భావనతో సీబీఐ అధికారులు ఆయనకు భరోసా కల్పించేందుకు ఇంటికి వెళ్రారు. భద్రతా పరంగా కొన్ని సచనలు చేశారు. ఏ చిన్న అనుమానం వచ్చిన తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
మరో వైపు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పై నిర్ణయం వెలువడలేదు. ఈ రోజు జరగాల్సిన విచారణ బుధవారానికి వాయిదా పడింది. సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాలేదని.. మధ్యాహ్నం విచారణ చేపట్టాలని.. న్యాయవాది కోరగా… జడ్జి అంగీకరించారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ ఆలస్యంగా వచ్చినందున బుధవారం విచారణ చేపడతామని జడ్జి వాయిదా వేశారు. అవినాష్ ను అరెస్ట్ చేసే విషయంలో ఎలాంటి ఆటంకాలు సీబీఐకి లేవు. పులివెందులలోనే వారు ఉన్నందున ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది.