స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఉమ్మడిగా పోరాడి… ఆంధ్రుల హక్కును కాపాడాల్సిన ఏపీ రాజకీయ పార్టీలు… పొలిటికల్ క్రెడిట్ గేమ్ ఆడుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని … ప్రజల్లో ఎదురుటివారిని తప్పుగా చూపించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ప్రభుత్వాన్ని నిఖార్సుగా ఒత్తిడి చేసే ప్రయత్నాలు మాత్రం చేయడంలేదు. తాజాగా… సీఎం జగన్, చంద్రబాబు ప్రధాని మోదీకి రాసిన లేఖల విషయంలో రంధ్రాన్వేషణ బయటపడింది. అయితే.. ఇద్దరూ లేఖలు రాశారని.. చంద్రబాబు రెండు లేఖలు రాశారని… పీఎంవో తేల్చేసింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తర్వాత సీఎం జగన్ సైలెంట్‌గా ఉంటున్నారని ఆయన స్పందించాలని వచ్చిన డిమాండ్ల నేపధ్యంలో ప్రధానమంత్రి మోడీకి ఓ లేఖ రాశారు. అయితే దానిపై ప్రధాని స్పందించలేదు. దీంతో… సీఎం జగన్ లేఖ రాయలేదని.. ఉత్తినే రాశారని ప్రచారం చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. రివర్స్‌లో వైసీపీ నేతలు చంద్రబాబు ఆ లేఖ కూడా రాయలేదు కదా అని విమర్శలు చేశారు. చివరికి చంద్రబాబు వేర్వేరు సందర్భాల్లో రెండు లేఖలు రాశారు. అయితే ఆయన రాయలేదని.. ఉత్తుత్తినే రాసినట్లుగా చెప్పుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించేవారు. అలా… ఎవరు లేఖలు రాయలేదో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో నేరుగా సమాచార హక్కుచట్టం కింద.. కొంత మంది పీఎంవోకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇద్దరూ లేఖలు రాశారని… పీఎంవో స్పష్టం చేసింది. వాటినిసంబంధిత శాఖకు పంపామని వారు సమాధానం పంపుతారని క్లారిటీ ఇచ్చింది.
ఇక్కడ సమస్య వారు లేఖలు రాయడమే. టీడీపీ, వైసీపీ ఇలా… ఎవరికి వారు ప్రత్యర్థులపై బురదచల్లేందుకు సమయం కేటాయించారు కానీ… సమైక్యంగా పోరాడి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందామనే ప్రయత్నాలు చేయడంలేదు. పార్లమెంట్లో కూడా ఎవరికి వారు మాట్లాడుతున్నారు. దీంతో కేంద్రం లైట్ తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో సమస్యలు తలెత్తినప్పుడు అక్కడి ఎంపీలు పార్టీలకు అతీతంగా సభను స్తంభింపచేసేవారు. సమస్య తీవ్రతను తెలియచేసేవారు. కానీ ఇప్పుడు.. ఏపీ ఎంపీల్లో ఆ స్ఫూర్తి కొరవడింది. గతంలో ప్రత్యేక హోదా కోసం … రెండు పార్టీల ఎంపీలు విడివిడిగా అయినా సభను స్తంభింపచేసేవారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వీర్యం చేయడంలో రాజకీయ పార్టీలదే ప్రధాన పాత్ర అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది సాధ్యం కాదనేది అందరూ చెప్పేమాట. స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం వాటాలు ప్రభుత్వానికి ఉండవచ్చు కానీ… ఆ ప్లాంట్ ఏపీలో ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఆందోళనలు చెలరేగితేనే పోస్కో ఏపీ వైపు చూస్తోంది. తాము సిద్ధంగా లేమని ఏపీ సర్కార్ ఒక్క మాట చెబితే.. ప్రైవేటీకరణ ఆగిపోతుంది. ప్రభుత్వ పరంగా అలాంటి ప్రయత్నం చేయకుండా రాజకీయ పరంగా పోరాడుతున్నట్లుగా నటించడం వల్ల.. మొదటికే మోసం వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.