కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్.డి. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లకు కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి వెళ్లాలా వద్దా అనే చర్చ ఆదివారం నాడు టీడీపీ వర్గాల్లో జరిగినట్టు సమాచారం. మంత్రులతో చర్చించిన తరువాత, హాజరు అవుదామనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కర్ణాటక వెళ్లేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా మొన్ననే కథనాలు వచ్చాయి.
ఇక, బెంగళూరులో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ఏర్పాట్ల విషయానికొస్తే… ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాంగ్రెస్ తీసుకుంది. ఎందుకంటే, భాజపా అప్రతిహత విజయాలకు కర్ణాటకలో బ్రేక్ పడింది. కాబట్టి, ఈ అవకాశాన్ని జాతీయ స్థాయిలో భారీ ఎత్తున ప్రచారం వచ్చేలా కాంగ్రెస్ వినియోగించుకుంటుంది. ఎల్లుండి బెంగళూరులో జరగబోతున్న ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తున్నారు. 11 ప్రతిపక్ష పార్టీల నేతలు, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హాజరయ్యే అవకాశం ఉంది. భాజపా వ్యతిరేక శక్తులన్నింటినీ ఈ వేదిక మీదికి తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది.
ఇక్కడే చిక్కంతా వచ్చి పడింది..! కేసీఆర్ కి తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం. కానీ, ఫెడరల్ ఫ్రెంట్ నేపథ్యంలో జేడీఎస్ తో ఇటీవలే స్నేహం కుదిరింది! కేసీఆర్ బెంగళూరు వెళ్లేది జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారానికే అయినా… అది, కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడుతున్న సంకీర్ణ సర్కారు. ఆహ్వానం జెడీఎస్ దే అయినా… కాంగ్రెస్ కు మద్దతుగా కూడా వెళ్లినట్టు సంకేతాలు వెళ్తాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా ఇంతే! గతంలో జేడీఎస్ తో కలిసి పనిచేసిన స్నేహం వారికి ఉంది. టీడీపీకి మద్దతుగా ఏపీకి చాలా సందర్భాల్లో దేవెగౌడ వచ్చారు. ఒకవేళ ఎడ్యూరప్ప రాజీనామా చేయకపోతే, జెడీఎస్ కి మద్దతుగా పోరాటం చేసేందుకు టీడీపీ కూడా సిద్ధమైంది. ఆ స్నేహంతోనే చంద్రబాబుకు కుమారస్వామి ఫోన్ చేసి ఆహ్వానించారు. కానీ, ఈ కార్యక్రమాన్ని తమ బల ప్రదర్శనగా కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ కార్యక్రమానికి హాజరైతే… కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నారనే విమర్శలు చేయడానికి ఏపీలో వైకాపా కాచుకుని కూర్చుందనడంలో సందేహం లేదు. మరి, ఈ ఇరకాటాన్ని ఇద్దరు చంద్రులూ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.