రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పోటీ పడి భారీ ఎత్తున 124,126 అడుగుల బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల ప్రతిష్టాపన ప్రకటించడం మంచి విషయమే. ఇందుకు గాను చంద్రబాబు నాయుడును జూపూడి ప్రభాకరరావు బృందం ప్రశంసలతో ముంచెత్తింది. తెలంగాణలో కడియం శ్రీహరి ప్రభృతులు కూడా ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు.
అమరావతిలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉద్యానవనం ఏర్పాటు చేస్తుంటే, హైదరాబాదులో ఎన్టీఆర్ స్మారక చిహ్నాన్నివదలివేసి ఆయన పేరిట వున్న పార్కులో ఈ భారీ విగ్రహం పెడతామంటున్నారు. అంబేడ్కర్ వివక్షా పూరితమైన హిందూ మతాన్ని వదలివేసి బౌద్ధం స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. అమరావతి ఒకనాటి బౌద్ధకేంద్రం కాగా ట్యాంక్‌బండ్ బుద్ధవిగ్రహం దరిదాపుల్లోనే హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం రానుండడం విశేషం. 125 వ జయంతి సందర్భంలో ఈ ప్రతిపాదనలు వచ్చాయి.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా ప్రత్యేక పార్లమెంటు సమావేశాల పేరిట హడావుడి చేసింది. కాంగ్రెస్ పునరుద్ధరణకు రాహుల్‌గాంధీ సామాజిక న్యాయ మార్గాన్ని చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. కేంద్ర రాష్ట్రాల్లోని పాలక పార్టీలూ ఈ విధంగా అంబేద్కర్‌ను గౌరవించడంతో ఆగక ఆయన ప్రధాన సందేశాన్ని గుర్తించి అమలు చేయడం ముఖ్యం. రాజ్యాంగం ప్రకారం రాజకీయ హక్కులలో లభించిన సమానత్వం, ఆర్థిక సామాజిక విషయాలలో కూడా వస్తేనే ప్రజాస్వామ్య ప్రక్రియ పరిపూర్ణమవుతుందని అంబేద్కర్ ఆనాడే స్పష్టం చేశారు.
సరళీకరణ యుగంలో నూతన ఆర్థిక విధానాల ఫలితంగా దళితులు అణగారిన వర్గాల పరిస్థితి ఆచరణలో దిగజారుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సామాజిక సంక్షేమం , ఉప ప్రణాళికల అమలు సక్రమంగా లేదని కాగ్ నివేదికలు విమర్శించాయి. హెచ్‌సియు నుంచి జెఎన్‌యు వరకూ వినిపించిన నిరసనధ్వానాలలోనూ అంబేద్కరిస్టులూ అభ్యుదయవాదులే ప్రధానంగా దాడులకు గురైనారు. ఈ విధానాలు మార్చకుండా ప్రచారాలకు రాజకీయాలకు పరిమితమైతే ఉపయోగం లేదు!