మోడీనామిక్స్ వీరవిహారం చేసింది. మధ్యతరగతిని కలల్లోకి పంపింది. చివరికి మేల్కొలిపింది. ఐదు లక్షల ఆదాయానికి పన్ను కట్టాల్సిన పనే లేదని ప్రకటించి పియూష్ గోయల్ చప్పట్లు కొట్టించుకున్నారు. నిజానికి … గోయల్ ఇన్ కంట్యాక్స్ శ్లాబ్స్ ఏమీ మార్చలేదు. అంటే.. గోయల్ గోల్ మాల్ చేశారు కానీ.. ఒక్క రూపాయి కూడా అదనపు ప్రయోజనం ఏమీ కల్పించలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2.5 లక్షల ఆదాయం వరకూ పన్ను మినహాయింపు ఉంది. దీన్ని రూ. 5 లక్షల రూపాయల వరకూ పెంచారు. కానీ ఇది శ్లాబ్ మార్పు కాదు. కేవలం టాక్స్ రిబేటు మాత్రమే. సాధారణంగా కుటుంబానికి సొంత ఇల్లో.. అద్దె ఇల్లో తప్పదు కాబట్టి… ఈ రెండున్నర లక్షల మినహాయింపు వస్తుంది. దీనిపై ఐదు శాతం పన్ను ఉన్నా… పది శాతం పన్ను ఉన్నా.. పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు. ఇది కాకుండా.. ..మరో లక్షన్నర వరకూ.. ఇన్సూరెన్స్, ఇతర సేవింగ్స్, గృహరుణం వడ్డీ అన్నీ కలిపి చూపించుకుని పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే.. ఐదారు లక్షల రూపాయలు సంపాదించే మధ్యతరగతి జీవి కి పన్నుల కట్టాల్సిన అవసరం ఇప్పటి వరకూ లేదు. ఇప్పుడు పియూష్ గోయల్ ఏం ప్రకటించారు. సేవింగ్స్ తో కలిపి ఆరున్నర లక్షల వరకూ మినహాయింపు అన్నారు. అంటే… మధ్యతరగతి ఏ స్థాయిలో వాళ్లు పన్ను కట్టరో.. అక్కడి వరకూ రిబేటు ఇస్తున్నట్లు ప్రకటించారు
పన్ను లేని ఆదాయం శ్లాబ్ కి.. గోయల్ ఐదు లక్షలకు మార్చి ఉంటే… ప్రజలకు ప్రయోజనం కలిగి ఉండేది. శ్లాబ్ మార్చడం అంటే.. ఐదు లక్షల వరకూ ఆదాయానికి పన్ను కట్టాల్సిన పని ఉండదు. ఆ పైన సంపాదనకు పన్ను కట్టాలి. కానీ ఐదు లక్షల కన్నా ఎక్కువ సంపాదిస్తే.. వివిధ సెక్షన్ల కింద.. . హోంలోన్ వడ్డీ, అసలు, ఇంటి అద్దెలు, సేవింగ్స్, ఇన్సూరెన్స్, పిల్లల ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు ఇలాంటివి ఎగ్జంపన్స్ పెట్టుకుంటే.. మరో మూడు, నాలుగు లక్షల వరకూ… పన్ను కట్టడానికి అవకాశం ఉండదు. ఎలా చూసినా..ఎడెనిమిది లక్షల ఆదాయం ఉన్న వారు.. ప్లాన్డ్ గా పన్ను కట్టకుండా ఉండగలరు. ఆరున్నర లక్షల కన్నా.. ఒక్క రూపాయి ఆదాయం వచ్చినా… ఏకంగా ఇరవై శాతం పన్ను కట్టాల్సిందే.
అంటే.. పది లక్షలు ఆదాయం సంపాదిస్తే… ఐదు లక్షల వరకూ రిబేట్ పోను.. మిగిలిన ఐదు లక్షలకు…గాను ఇరవై శాతం పన్ను.. లక్ష రూపాయలు కేంద్రానికి కట్టాల్సిందే. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు. ఈ మోడినామిక్స్ సులువుగా అర్థం కావు. కానీ..మధ్యతరగతి ప్రజలకు మిగిలించింది ఏదీ లేదని మాత్రం కాస్త లేటుగా అర్థం అవుతుంది. ఇరవై శాతం టాక్స్ కట్టేశాను కదా.. ఇక ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటానంటే కుదరదు. మీకు టాక్స్ కట్టి మిగుల్చుకున్న సొమ్ముతో సినిమాకెళ్లినా జీఎస్టీ కట్టాల్సిందే… అలా పన్నుల ..మీద.. పన్నులు.. కట్టుకుంటూ పోవాల్సిందే. ఇదీ మోడినామిక్స్ లో అసలు మాయ.