తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా, అడ్డగోలుగా తమ రాష్ట్రంలో నిర్మించేస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడం గురించి.. చంద్రబాబునాయుడు తీరులో ఎంతమాత్రమూ మార్పు వచ్చినట్లుగా కనిపించడం లేదు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రభుత్వ పరంగా ఏమాత్రం చొరవ చూపించడం లేదని, చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే భయపడుతున్నారని, అందుకే ఏపీ రాష్ట్ర ప్రయోజనాల్ని తెలంగాణకు తాకట్టు పెడుతున్నారని విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే జగన్ నిరాహారదీక్షకు కూర్చుంటున్న ఈ సమయంలో కూడా చంద్రబాబు ఆలోచన సరళిలో ఏమాత్రం మార్పు వచ్చినట్లుగా కనిపించడం లేదు. వాటిమీద ప్రభుత్వం అడ్డుకునే కృషి ఏమిటో స్పష్టం చేయడం లేదు.
అదే సమయంలో ప్రత్యేక హోదా అంశం మీద కూడా చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నదో ప్రజలకు సందేహం కలుగుతోంది. హోదా గురించి కేంద్రంలోని మంత్రులు అడ్డగోలుగా కామెంట్లు చేసిన తర్వాత.. చంద్రబాబునాయుడు తాము ఎలా స్పందించాలో తేల్చుకోలేకపోతున్నదని అనిపిస్తోంది. పైగా చంద్రబాబు ఆ విషయంలో ఇప్పటికీ శ్రద్ధ పెడుతున్నట్లుగా తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోతున్నారు.
ఉదాహరణకు ఈనెల 2వ తేదీన కేబినెట్ సమావేశం, 3వ తేదీన తెదేపా పాలిట్బ్యూరో సమావేశం జరగబోతున్నాయి. ప్రత్యేకహోదా విషయంలో ఎదురవుతున్న వంచనను ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని చర్చించడానికి పాలిట్బ్యూరోను వేదికగా చేసుకున్నారే తప్ప.. కేబినెట్లో దాన్ని గురించి చర్చించడం లేదు. కేబినెట్లో ప్రభుత్వం తరఫున హోదా గురించి చర్చించి, హోదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందేనంటూ కేంద్రానికి లేఖ రాయడం జరిగితే ఏదో కాస్త శ్రద్ధ ఉన్నట్లు తెలిసేదేమో.
కానీ ఇప్పటికీ ఏదో పార్టీ వర్గాల్లో అంటే పాలిట్బ్యూరోలో చర్చకు ఎజెండాలో పెట్టారే తప్ప.. కేబినెట్లో చర్చకు ఎజెండాలో మాత్రం పెట్టలేదు. హోదాపై చంద్రబాబునాయుడు కు ఇప్పటికీ శ్రద్ధ లేదనే తేలుతోంది. కాకపోతే.. ప్రజల్లో అవగాహన మారుతున్న నేపథ్యంలో తాము కూడా ఏదో చేస్తున్నట్లు కనిపించడానికే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. అలాకాకుండా, చిత్తశుద్ధితో చంద్రబాబు సర్కారు ఏదైనా చేయదలచుకుంటే మాత్రం హోదా విషయంలో ప్రయోజనం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.