మన్యంలో గిరిజనులని వేధిస్తూ… జగన్ రెడ్డి చీకటి దందాలకు సహకరిస్తారని ఆరోపణలు ఉన్న .. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హంతకుడు, హత్య చేసి నిర్భయంగా డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంపై స్పెషల్ ఫైల్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అసలు సుబ్రహ్మణ్యం హత్య కేసును పోలీసులు సరిగ్గా విచారణ చేయలేదు. హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారని ఇతర వివరాల జోలికి వెళ్లలేదు. కానీ ఒక్కడే హత్య చేయలేడని.. మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని తీసుకుని రాలేడన్న సంగతిని మాత్రం ఎవరు చెప్పినా పట్టించుకోలేదు.
అసలు పోలీసులు ఈ కేసులో విచారణ చేయలేదు. చార్జిషీటు వేయలేదు. అందుకే ఆయనకు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. ఆ తర్వాత అసలు ముందడుగు పడలేదు. పైగా బాధితుల్ని బెదిరించేలా.. ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ హత్య కేసు దర్యాప్తు పూర్తి స్థాయిలో ఊపందుకోనుంది. ఆ దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించి హంతకుడికే మద్దతు పలికిన పోలీసులపై కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.
అనంతబాబు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అనేక కేసులుఉన్నాయి. గతంలో రౌడీషీట్ కూడా ఉండేది. కానీ ఆ షీట్ లేదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు మొత్తం వ్యవహారంలో ఆయన గుట్టు బయటకు లాగనున్నారు. కొసమెరుపేమిటంటే గతంలో ఈ కేసు సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు అదే అనంతబాబుకు మైనస్ అవనుంది.