ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ మధ్య సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి… వృద్ధాప్య పెన్షన్ ను డబుల్ చేశారు. పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు కూడా రూ. 10,000/- చొప్పున చెక్కులిచ్చారు. పక్కా ఇళ్ల నిర్మాణాల కోసం నిధుల కేటాయింపు, గతంలో కట్టుకున్న ఇళ్ల మరమ్మతులకు రూ. 10 వేలు చొప్పున ఆర్థిక సాయం… ఇలా వరుసగా ఈ మధ్య కీలక నిర్ణయాలు ఒక్కోటీ ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు నిరుద్యోగ భృతి అంశమై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి టీడీపీ ఎల్పీ సమావేశంలో చర్చ జరిగింది.
నిరుద్యోగ భృతిని రూ. 1000గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీన్ని కూడా డబుల్ చేస్తూ రాష్ట్రంలోని అర్హులైన నిరుద్యోగులందరికీ రూ. 2000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించబోతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పెరుగుదల అంశాన్ని అసెంబ్లీలో తానే స్వయంగా ప్రకటిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. అయితే, ఎన్నికల్లోపుగానే పెంచిన భృతి నిరుద్యోగులకు అందేలా చర్యలు తీసుకుంటామని, వచ్చే నెలనాటికే పెంచిన మొత్తం నిరుద్యోగుల ఖాతాల్లో ఉంటుందని కూడా సీఎం ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి, నిరుద్యోగ భృతి అమలపై సమగ్ర సర్వే చేయించి… ఇతర రాష్ట్రాల్లో అమలు జరిగిన తీరు, కొన్ని ప్రభుత్వాలు భృతి ఇవ్వడంలో విఫలమైన తీరుపై కూడా అధ్యయనం చేయించారు. ఇదేదో కొన్నాళ్లపాటు కొనసాగి, మరుగునపడే పథకంలా ఉండకుండా… నిరుద్యోగులకు ఉపాధి లభించే వరకూ అందే సాయంలా ఉండాలని పథకాన్ని డిజైన్ చేశారు. ఓపక్క అర్హులైన నిరుద్యోగులకు భృతి అందిస్తూనే… మరోపక్క నైపుణ్యాల శిక్షణలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ విధి విధానాలన్నీ రూపొందేసరికి కొంత ఆలస్యమైన మాట వాస్తవమే కానీ… సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిపెట్టుకుని ఈ పథకాన్ని పక్కగా డిజైన్ చేశారనడంలో సందేహం లేదు. వృద్ధాప్య పెన్షన్, డ్వాక్రా మహిళలకు సాయం అనంతరం, నిరుద్యోగులను వదిలేశారంటూ కొంతమంది ప్రతిపక్ష నేతలు విమర్శించారు. తాజా నిర్ణయంలో ఆ విమర్శలకు కూడా చెక్ పడ్డట్టే. ప్రతిపక్షానికి ఎన్నికల్లో ఏ రకమైన విమర్శలూ చేసేందుకు ఆస్కారం లేకుండా తాజా సంక్షేమ పథకాల అమలు అధికార పార్టీకి ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.