బీజేపీయేత పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చి పోరాటం దిశగా సిద్దం చేసే ప్రయత్నంలో టీడీపీ అధినతే చంద్రబాబు కీలకమైన అడుగు వేశారు. రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఆయన వెంట పలువురు కీలక నేతలు ఉన్నారు. మోడీని ఢీకొట్టాలంటే.. ఓ బలమైన కూటమి ప్రత్యామ్నాయంగా ఉంటే.. ప్రజలు కచ్చితంగా ఆ కూటమికే పట్టం కడతారన్న అభిప్రాయం.. కాంగ్రెస్, టీడీపీ పక్షాల నేతల్లో వ్యక్తమయింది. దీనికి సంబంధించి చంద్రబాబే మరింత చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు కోరినట్లు తెలుస్తోంది. కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ.. ప్రధానమంత్రి అభ్యర్థి అనే ప్రస్తావన.. తీసుకు రాకుండా.. ఎన్నికల ఫలితాలను బట్టి.. అప్పుడు నిర్ణయం తీసుకునే నిర్ణయం అయితే.. అందరూ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి ముందుకు వస్తారన్న అభిప్రాయం… ఆయా పార్టీల నేతల మధ్య జరిగింది. అలాగే తెలంగాణలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై కూడా… రాహుల్, చంద్రబాబు మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన వెంటనే ఎన్సీపీ నేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాలను కలిశారు. సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలతో పాటు వివిధ పార్టీల నేతలు, సంస్థలపై జరుగుతున్న దాడులపై చర్చించారు. సీబీఐ, ఆర్బీఐ వంటి కేంద్ర వ్యవస్థల నిర్వీర్యం తదితర అంశాలపై ముగ్గురు నేతలూ కలిసి చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా ఎంతో గొప్ప నేతలని, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో వారితో చర్చించినట్లు చెప్పారు. దేశంలోని వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తంచేసిన సీఎం.. వాటిని సరిచేయడమే లక్ష్యమన్నారు. మిగతా పార్టీల నేతలతోనూ కలిసి మాట్లాడతామని, బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగడుతున్నామని, తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలతోనూ పనిచేస్తామని ముగ్గురు నేతలు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చారు.
కాంగ్రెస్ లేకుండా.. కూటమి బలంగా ఉండదని.. చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే… కాంగ్రెస్ తో ఎంతో కొంత వైరుధ్యం ఉన్న పార్టీలను… కూడా… కూటమిలో చేర్చేందుకు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రాంతీయ పార్టీలకు ఇబ్బందులు లేకుండా చూసేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా.. జాతీయ ప్రయోజనాల కోసం.. తగ్గి వ్యవహరించేందుకు సిద్దంగా ఉంది. కర్ణాటకలో జరిగిన పరిణామాలే దీనికి నిదర్శనమంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పెద్ద పార్టీగా.. బీజేపీ ప్రత్యామ్నాయ కూటమికి చంద్రబాబు ప్రయత్నాలు కీలకంగా మారాయి. ముందు ముందు ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయన్నదానిపై కూటమి స్వరూపం ఆధారపడి ఉంటుంది.