మాటల్లో డాంబికం, దర్పం, హీరోయిజం….చేతల్లో మాత్రం పూర్తి వ్యతిరేక వ్యవహారం సీమాంధ్రనేతల స్టైల్ అన్నది తెలంగాణా ఉద్యమ సమయంలోనే తెలుగు ప్రజలకు అర్థమైంది. మాటలతో తెలంగాణా నేతలను ఓ స్థాయిలో రెచ్చగొట్టిన సీమాంధ్ర నేతలు చేతల్లో మాత్రం కామెడీ చేసేశారు. అందుకు సీమాంధ్ర ప్రజలు భారీగా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. విషాదకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు కూడా సీమాంధ్ర నేతల వ్యవహారం అలానే ఉంది. చంద్రబాబు, జగన్, పవన్‌లు ముగ్గురూ కూడా పోరాటం చే్స్తాం ….సాధిస్తాం అని తరచుగా మాటలు చెప్తూ ఉన్నారు. తాజా మహానాడు, ఆ తర్వాత మీడియా ఇంటర్యూలలో కూడా రైల్వే జోన్ కోసం పోరాటం చేస్తున్నాం అని చెప్పుకొచ్చాడు. జగన్, పవన్‌లది కూడా అదే డైలాగ్. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కోసం పోరాటం చేస్తాం అని చెప్తూ ఉంటారు. ఈ ముగ్గురు నేతల పోరాటం మామూలు ప్రజలకు మాత్రం అస్సలు కనిపించడం లేదు. బాబు భజన మీడియాలో చంద్రబాబు, పవన్‌ల పోరాటం కనిపిస్తూ ఉంటుంది. జగన్ మీడియాలో జగన్ పోరాటం కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఆ ముగ్గురు నేతలూ కూడా మీడియా ముందుకు వచ్చిన సందర్భాల్లోనే.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలానే నష్టపోయింది. ఆ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పిన నరేంద్రమోడీ గద్దెనెక్కి మూడేళ్ళవుతోంది. మోడీవారు ఏం చేసినా ఈ ఏడాదిలోనే చేయాలి. ఆ తర్వాత ఎన్నికల ఏడాది వచ్చేస్తుంది. ఎన్నికల ఏడాదిలో రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చే పరిస్థితి ఉన్న సమస్యలను మోడీ టచ్ చేస్తాడనుకోవడం భ్రమ. అంటే ప్రత్యేక హోదా అయినా, రైల్వే జోన్ అయినా ఇస్తే ఈ ఏడాదిలోనే ఇవ్వాలి. లేకపోతే ఈ టెర్మ్‌కి ఇంతే సంగతులు. అలాంటప్పుడు నిజంగా పోరాడాలన్న చిత్తశుద్ధి ఉంటే బాబు, పవన్, జగన్‌ల తీరు ఇలానే ఉంటుందా? మోడీతో పెట్టుకుంటే పూర్తిగా మునుగుతాం అని జనాలను బెదరగొట్టి పబ్బం గడుపుకుంటూ పోరాటం అంటూ మాటలు చెప్తూ కాలం వెళ్ళదీస్తున్నారే తప్ప హామీలు ఇచ్చిన స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేస్తున్నారా? పోరాటాలు, ఉద్యమాల గురించి మన నాయకులకు ఎంత తెలుసో తెలియదుగానీ వీళ్ళ మాటలు-చేతల మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తుంటే మాత్రం ‘పోరాటం’ అనే మాట వీళ్ళకు కేవలం ఒక ఊతపదం అన్న అనుమానం అయితే కలుగుతోంది.