జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి వెనుక షర్మిల, విజయమ్మ ఉన్నారంటూ.. ఆరోపణలు చేసిన… తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కు … టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ముందు మీడియా ఎదుట మాట్లాడవద్దని హెచ్చరించారు. జగన్ పై దాడి ఘటనలో… వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు.. వైవీబీ రాజేంద్రప్రసాద్ విమర్శలకు తేడా ఏమందని చంద్రబాబు మండిపడ్డారు. కుటుంబసభ్యుల్ని తీసుకొచ్చి… మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఇక ముందు.. టీవీ చానళ్ల డిబేట్లకు వెళ్లడం కానీ… ప్రెస్ మీట్లు పెట్టడం కానీ చేయవద్దని ఆదేశించారు.
విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన కోడికత్తి దాడి తర్వాత.. వైసీపీ నేతలు చేసిన రాజకీయ ప్రకటనలతో.. తెలుగుదేశం పార్టీకే అడ్వాంటేజ్ వచ్చిందన్న భావన రాజకీయవర్గాల్లో ఉంది. జగన్ పై దాడి జరిగితే..దాన్ని నేరుగా చంద్రబాబుపైకి నెట్టే ప్రయత్నంలో వైసీపీ నేతలు చేసిన ప్రకటనలు, ప్రయత్నాలతో… ఆ వ్యవహారం అంతా రాజకీయమేనన్న అభిప్రాయం అంతటా ఏర్పడుతోందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు టీడీపీ నేతలు. కానీ.. వైవీబీ రాజేంద్రప్రసాద్ మాత్రం మాట తూలారు. కంట్రోల్ తప్పిపోయారు. జగన్ కుటుంబసభ్యులను ఈ ఘటనలో ఇన్వాల్వ్ చేశారు. వైవీబీ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరిగిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో పలుమార్లు టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టేలా ప్రకటనలు చేశారు. ప్రత్యేకహోదా విషయంలో.. సినీ తారలు స్పందించడం లేదని.. టాలీవుడ్ పైనా ఘాటు వ్యాఖ్యలు చేయడంతో.. సినీ పరిశ్రమ పెద్దలంతా.. నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మరీ మితి మీరిపోవడంతో… ఇక టీడీపీ తరపు డిబేట్లు, ప్రెస్ మీట్లు పెట్టవద్దని ఆదేశించారు. దీంతో ఇక వైవీబీ గొంతు ఇక ఇప్పుడల్లా మీడియాలో వినపడకపోవచ్చని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.