సీసీసీ సంస్థ ద్వారా… కరోనా కష్టకాలంలో సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చింది చిత్రసీమ. సీసీసీకి విరాళాలు అందించి, ఓ నిధిగా కొంతమొత్తాన్ని జమ చేశారు. చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ట్రస్ట్ ఇప్పటికే రెండు దఫాలుగా సినీ కార్మికులకు నిత్యావసర వస్తువుల్ని అందించింది. ఇప్పుడు మూడోసారి కూడా సీసీసీ తరపున నిత్యావసర వస్తువులు అందించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈసారి ఏకంగా పదివేల మంది సినీ కార్మికులకు సాయం చేయబోతున్నారు. చిత్రసీమలో ఉన్న అన్ని అసోసియేషన్ల సభ్యులకూ ఈ సాయం అందబోతోంది. అంతేకాదు.. థియేటర్లో పనిచేసే కార్మికులకు, అంటే.. పోస్టర్లు అతికించేవాళ్లకు, టికెట్ కౌంటర్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు సైతం… ఈసారి నిత్యావసర వస్తువుల్ని అందిస్తారు. ”ఇప్పటికే మూడో విడత నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం మొదలెట్టాం. ఈ కష్టం… తాత్కాలికమే. ఎంత కాలం ఉండదు. ఈ కష్టాన్ని తట్టుకుని నిలబడదాం” అని చిరు చిత్రసీమకు ధైర్యం చెబుతూ.. ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.