హుజురాబాద్ ఉపఎన్నికలు జరుగుతున్నందున అక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఈసీ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు అందాయి. ఇప్పటి వరకూ లేని అభ్యంతరాలు ఇప్పుడే ఈసీ వ్యక్తం చేయడానికి కారణం ఎవరో ఫిర్యాదు చేయడమేనని భావిస్తున్నారు. ఆ ఫిర్యాదు చేసింది బీజేపీ, కాంగ్రెస్ నేతలేనని టీఆర్ఎస్ నేతలు ఆరోపించడం… కాదు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని టీఆర్ఎస్సే గేమ్ ఆడుతోందని విపక్షాలు ఇక ఆరోపించుకునే రాజకీయం ప్రారంభమవుతుంది.
అమల్లో ఉన్న పథకాలను ఆపరు కాబట్టి .. కేసీఆర్ ముందస్తు వ్యూహం ప్రకారం షెడ్యూల్ రాక ముందే దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. నిధులు విడుదల చేశారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. అ ప్రక్రియ జరుగుతూండగానే షెడ్యూల్ వచ్చింది. అయినప్పటికీ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఎంత మందికి ఇచ్చారో స్పష్టత లేదు. అయితే వందల్లోనే ఇచ్చి ఉంటారని.. ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో దళిత బంధు ఆగిపోతే ఎన్నికలయిన తర్వాత ఇస్తారా అన్న డౌట్లు చాలా మందిలో వచ్చే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్లో వరద సాయం కూడా ఇలా మధ్యలో నిలిపివేసి ఎన్నికలవగానే ఇస్తామన్నారు. తర్వాత ఇవ్వలేదు. అందుకే విపక్షాలకు ఇదే ఇదో అస్త్రం అయ్యే అవకాశం ఉంది. అయితే ఎవరు ఫిర్యాదు చేశారో తేలే దాకా రాజకీయం కొనసాగుతుంది. ఇప్పటికే ఈటల పేరుతో అనేక ఫేక్ లేఖలు బయటకు వచ్చాయి. ఇప్పుడు అలాంటివి అన్ని వైపుల నుంచి దూసుకొచ్చే అవకాశం ఉంది.