తెలుగు చలన చిత్ర పరిశ్రమ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తిని చాటి చెప్పేందుకే
ఘనంగా వేడుకలు నిర్వహించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయించింది. ‘మా’ అధ్యక్షుడు హీరో మంచు విష్ణు ఈ మేరకు వేడుకలకు సంబధించిన వివరాలు వెల్లడించారు. మలేసియా వేదికగా జులై నెలలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల ద్వారా ఫండ్ రైజ్ చేసి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ‘మా’ సభ్యుల కోసం ఉపయోగించనున్నారు. సినీ పెద్దలతో చర్చించి, వారి ఆశీస్సులతో త్వరలో తేదీని ప్రకటిస్తారు. ‘వేడుకల నేపధ్యంలో జులైలో షూటింగ్లకు మూడు రోజులపాటు సెలవులు ఇవ్వాలని కోరాం. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారు’ అని చెప్పుకొచ్చారు విష్ణు. ఇదే సందర్భంలో మెగా చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం గర్వించాల్సిన విషయమని ఆయన పేర్కొన్నారు.