మొత్తానికి చలపతిరావు బాబాయ్ దారుణంగా దొరికిపోయాడు. ఆయన అనకూడని మాటే అన్నాడు. ఎవ్వరూ కాదలేరు. అందుకే నాగార్జున మొదలుకుని రకుల్ వరకూ, రామ జోగయ్య శాస్త్రి నుంచి మా అసోసియేషన్… అందరూ చలపతిని కడిగి పాడేశారు. ఫేస్ బుక్‌లో, ట్విట్టర్లో చలపతిరావుని నిలదీశారు. తలో కామెంట్‌తో చలపతిని చెడుగుడు ఆడుకొన్నారు. ఒక్కరు కూడా ఆయన్ని సమర్ధించరు. ఆఖరికి ఆయన కుటుంబ సభ్యులతో సహా. జరిగిన తప్పుని చలపతి తెలుసుకొన్నాడు కూడా. నన్ను చరిత్ర హీనుడ్ని చేసిన సంఘటన ఇది.. అంటూ చలపతిరావు కూడా బోరుమంటున్నాడు.
చలపతిరావు వ్యాఖ్యపై సోషల్ మీడియా స్పందించిన విధానం నిజంగా ఆశ్చర్యపరిచింది. ఇంత త్వరగా.. ఇంత ఘాటుగా ప్రతిస్పందిచిన తీరు, దానికి చలపతిరావు దిగొచ్చి స్వయంగా ఓలేఖ రాసి క్షమించమని ప్రాధేయ పడడం ఇదంతా.. సూపర్బ్. ఎవరి తప్పు వాళ్లు తెలుసుకొనేలా చేయడం ప్రస్తుత సమాజానికి అవసరం కూడా. అయితే.. ఒక్క చలపతిరావునే ఎందుకు టార్గెట్ చేయాలి? మిగిలిన వాళ్ల మాటేంటి? అలీ ఏమైనా తక్కువ తిన్నాడా? ఎన్నిసార్లు ఎన్ని బూతులు మాట్లాడలేదు? జబర్దస్త్‌లో హాస్యం మాటేమిటి? ఓ అగ్ర కథానాయకుడు వేదికపై హీరోయిన్ల గురించి అసభ్యంగా మాట్లాడితే అప్పుడేం చేశాం? ఇవన్నీ ఈ సందర్భంగా గుర్తు చేసుకొని తీరాల్సిందే. ప్రతీసారీ ఇంతే ఘాటుగా రియాక్ట్ అయితే బాగుంటుంది కదా? అలీ ఎప్పుడైతే అమ్మాయిల నడుము గురించి మాట్లాడాడో అప్పుడే ఇంత ఇదిగా రియాక్ట్ అయితే… చలపతిరావు ఈరోజు నోరు మెదిపే ధైర్యం చేయకపోదుడు. టీవీలో చూపిస్తున్న బూతుని హాస్యం పేరుతో ఎంజాయ్ చేస్తూ, ఆ ఛానల్ టీఆర్పీ రేట్లు పెరగడానికి ఇతోదికంగా సహాయం చేసే ప్రేక్షకలోకం ఇప్పుడేమంటుంది? కళ్ల ముందు బూతు కనిపిస్తూనే ఉంది. మనం చూసి చూడనట్టు వదిలేద్దామా? లేదంటే ఈ రోజున చలపతిరావుని నిలదీసినట్టు, నిలదీస్తూనే ఉందామా? వాళ్లు తమ తప్పు తెలుసుకొని లెంపలు వేసుకొనే దాకా పట్టిన పట్టు వదలకుండా ఉండగలమా?? నెటింజన్లు, మీడియా, జనం… ఆలోచించుకోవాల్సిన విషయమిది.