రాజకీయం అంటేనే అవకాశవాదం. పార్టీలకు ఎలాగూ తప్పదు కానీ వాటికి సంబంధం లేనివాళ్లు రాజకీయాల్లో తలదూరిస్తే తిప్పలు తప్పవు. తెలంగాణలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. బీఆర్ఎస్ను నమ్మి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోయిన వాళ్ల పాపం పెద్ద కష్టమే వచ్చిపడింది. తాము చేసిన పనికి అటు బీఆర్ఎస్ అండలేక, ఇటు అధికారపార్టీకి సమాధానం చెప్పుకోలేక కొందరు తలపట్టుకుంటున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక టెన్షన్‌తో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు.
HCU ల్యాండ్ ఇష్యూలో రేవంత్ ను ఇరకాటంలో పెట్టేందుకు రాజకీయం చేసింది బీఆర్ఎస్. కేటీఆర్ ఇస్తున్న అభయమో ఏమిటో కానీ ఆయన్ను చూసుకొని తటస్థులు, మరికొంతమంది రెచ్చిపోయారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా విశ్వసనీయతను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా గులాబీ కంటెంట్ ను విశ్వసించారు. గులాబీ దండుకి చెందిన సామజిక మాధ్యమాల్లో కనిపించేదంతా నిజమేనని భ్రమపడి ఫోటోలను , తమ పర్సనల్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఏఐ క్రియేటెడ్ ఫోటోలతోపాటు , జింకలు చనిపోయినట్లుగా ఫోటోలను వ్యక్తిగత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలువురు ప్రముఖులపై కేసులు నమోదు అవుతున్నాయి.
వారంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రభావానికి లోనై.. కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన కంటెంట్ గురించి పొరబడి కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తోంది. పర్యావరణ పరిరక్షణపై గొంతెత్తకుండా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే బీఆర్ఎస్ కుట్రలో కొంతమంది సెలబ్రీటీలు, కేటీఆర్ అండ్ కో మూలంగా ఇరుక్కోవాల్సి వచ్చింది. ఇప్పటికప్పుడు ఈ ఇష్యూలో అన్నివర్గాల నుంచి రేవంత్ పై ఎదురుదాడి చేయించినా.. ఫేక్ ఫోటోల వలన కేసులు ఎదుర్కోవడం వలన భవిష్యత్ లో బీఆర్ఎస్ సోషల్ మీడియాకు విశ్వసనీయత తగ్గుతుందని.. సెలబ్రిటీల మద్దతు కోల్పోతుందని అంటున్నారు. కొన్నిసార్లు పెరగడం తగ్గేందుకేనని ఊరికే అనలేదేమోనని బీఆర్ఎస్ రాజకీయం నిశితంగా గమనిస్తే అర్థం అవ్వక మానదు.