మొదటి నుంచి చిత్ర రంగానికీ, రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉంది. సినీ గ్లామర్ తో రాజకీయాల్లో అడుగుపెట్టి రెండు రంగాల్లో హీరోలుగా నిలిచిన జాబితా పెద్దదే ఉంటుంది. ఎంజీఆర్, జయలలిత సినిమారంగం లో ఒక వెలుగు వెలిగి, రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా తమ హవా కొనసాగించారు. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారు. తరవాత తరంలో విజయ కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్, రాధిక, ఖుష్బూ లాంటి స్టార్స్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు విజయ్ వంతు వచ్చింది. తెలుగులో ఎన్టీఆర్ సినీ రంగం నుంచి రాజకీయ రంగం లోకి అడుగుపెట్టి ఎనలేని కీర్తిప్రతిష్టలు గడించారు. ఎన్టీఆర్ తరవాత కొంత మంది నటీనటులు పాలిటిక్స్ లో అడుగుపెట్టినా ఎన్టీఆర్ స్థాయిని అందుకోలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరికి కాంగ్రెస్ లో విలీనం చేసేసారు. తరవాత రాజకీయాల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటున్నారు.
2024 ఎన్నికల్లో కూడా సినీ ప్రభావం కనిపించింది. కొంతమంది నటీనటులు, దర్శకులు ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేశారు. కొన్ని చోట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. కొన్ని చోట్ల ఓడిపోయారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవన్ కల్యాణ్ గెలుపు. 2014 లో పార్టీ పెట్టి ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉన్నా పోటీ చేయలేదు. 2019 లో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే, రెండిటిలో ఓడిపోయారు. కానీ 2024లో చరిత్ర మారింది. ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజక వర్గం నుంచి భారీ మెజార్టీ తో గెలుపొందారు. అంతే కాకుండా 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 సీట్లు గెలుచుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. అధికార, ప్రతిపక్షాలు రెండు పవన్ కళ్యాణ్ వే కావటం విశేషం. బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. అయితే నగరి నుంచి పోటీ చేసిన రోజా దారుణ పరాజయాన్ని మూటగట్టుకొన్నారు. టీడీపీ కూటమి తుఫానులో రోజా అడ్రస్స్ గల్లంతయ్యింది.
మలయాళ ఇండస్ట్రీ నుంచి సురేష్ గోపి త్రిసూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. సురేష్ గోపి తెలుగువారికి కూడా సుపరిచుతుడే. ఆయన నటించిన పలు మలయాళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. 1952 నుంచి 2024 వరకు మొత్తంగా 18 సార్లు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జన్ సంఘ్, జనతా పార్టీ, ప్రస్తుత బీజీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరూ విజయం సాధించలేదు. మొట్ట మొదటి సారిగా కేరళ రాష్ట్రం నుంచి బీజేపీ అభ్యర్థిగా పార్టమెంట్‌లో అడుగు పెట్టబోతున్న వ్యక్తిగా సురేష్ గోపి రికార్డులకెక్కాడు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి అడుగుపెడతారు అని ప్రచారం జరుగుతూనే ఉంది. ఫైనల్ గా కంగనా బీజేపీ పార్టీ తరపున హిమాచల్ ప్రదేశ్ కి చెందిన మండి నియోజక వర్గం నుంచి ఎంపీగా పోటీ చేయటం 74వేల మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఒక రకంగా కంగనాది ఒంటరి పోరాటం. ఎందుకంటే బాలీవుడ్ సినీతారలఎవరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆమెకు సపోర్ట్ చేయలేదు. ఎలాంటి రాజకీయ నేపథ్యం, అనుభవం లేకుండా పోటీ చేసిన మొదటిసారే గెలిచి, తన స్టామినా చూపించింది.
రచనా త్రిపాఠి బెంగాల్ లో హుగ్లీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందింది. రచనా త్రిపాఠి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కన్యాదానం, బావగారు బాగున్నారా, మావిడాకులు లాంటి సినిమాల్లో నటించిన రచన అనగానే అంతా గుర్తు పడతారు. టాలీవుడ్ లో పలుసినిమాల్లో విలన్ గా నటించిన రవికిషన్ యూపీ లోని గోరఖ్ పూర్ నుంచి గెలిచారు. యూపీలో మథుర నుంచి హేమ మాలిని విజయం సాధించారు. బుల్లితెర రాముడిగా పేరు తెచ్చుకున్న అరుణ్ గోవిల్, బీజేపీ తరపున ఉత్తర ప్రదేశ్ మీరట్ నుంచి గెలుపొందారు.
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి, పలు రంగాల్లో సత్తా చాటుతున్న రాధిక తమిళనాడు విరుదనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్థానంలో కూడా గెలుపు దక్కలేదు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ భార్య గీత కర్నాటకలోని శివమొగ్గలో పోటీ చేసి ఓడిపోయారు. మొత్తానికి ఈ ఎన్నికలు సినీ తారలకు మిశ్రమ ఫలితాల్ని అందించాయనే చెప్పాలి.