నాగశౌర్యకి ‘ఛలో’ రూపంలో మరో హిట్ దొరికింది. ఓ విధంగా శౌర్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇదే. సినిమా చూసినవాళ్లంతా ‘బాగుంది… బాగుంది’ అనడంతో మౌత్ టాక్ పెరుగుతూ ఈ సినిమా హిట్ నుంచి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. వారాంతం దాటినా వసూళ్ల హవా తగ్గలేదు. అయితే ‘ఛలో’ టీమ్‌కి ఇప్పుడు ఓ తీయని తలనొప్పి ఎదురైంది. అదే… క్యూబ్‌ల రూపంలో. ఓ మంచి సినిమా వస్తే.. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు క్యూబ్‌ల ద్వారా ఇళ్లలోనే సినిమాలు చూడ్డానికి ఇష్టపడతారు. ‘ఛలో’ టాక్ చూసిన సెలబ్రెటీలు క్యూబ్‌ల కోసం నిర్మాతపై ఒత్తిడి చేస్తున్నారు. ఇది నాగ శౌర్య సొంత సినిమా. కాబట్టి అడిగినవాళ్లందరికీ క్యూబ్‌లను ఇష్టంగానే అందిస్తున్నారు. కేసీఆర్ లాంటి రాజకీయ ప్రముఖుల దగ్గర్నుంచి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల వరకూ అందరికీ క్యూబ్‌లు వెళ్లాయి. ‘ఛలో’ ఆడియో ఫంక్షన్‌కి వచ్చి చిత్రబృందాన్ని ఆశీర్వదించిన చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్‌లో లేరు. ఆయన రాగానే చిరు కోసం ఓ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ‘ఛలో’ టీమ్ సిద్ధం అవుతోంది. మొత్తానికి సినిమా రంగంలోనే కాదు, అటు రాజకీయ ప్రముఖులకూ ‘ఛలో’ ఫీవర్ పాకేసిందన్నమాట.