మారుతి ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు ఎవ్వరూ కాదనలేని నిజం. చిన్న సినిమాల్ని ఎలా తీయాలో నేర్పించాడు. కానీ.. దాంతో బాగుపడిందెవరు? మారుతి మాత్రమే. మారుతిలా ఆలోచించి, మారుతి దారిలో సినిమాలు తీసినవాళ్లెవ్వరూ బాగుపడలేదు. ఈరోజుల్లో తరవాత.. ఆ టైపు కథలతో వచ్చిన సినిమాల లిస్టు తీయండి. నిజాలు తెలిసిపోతాయి. మారుతి వల్ల మారుతి లాభపడ్డాడంతే. భలే భలే మగాడివోయ్‌తో మారుతి రేంజు పెరిగింది. ఇప్పుడు బాబు బంగారం హిట్టయితే ఎక్కడికో వెళ్లిపోతాడు. కానీ అంతకు ముందే మారుతిని పొగడ్తలతో ముంచేశారు అతిథులంతా. బాబు బంగారం ఆడియో ఫంక్షన్ లో వక్తలు వెంకీని ఎంత పొగిడి పాడేశారో, అంతకంటే ఎక్కువగా మారుతిని ఆకాశానికి ఎత్తేశారు.
నాని అయితే.. కమర్షియల్ సినిమాకి నిర్వచనం మారుతి.. అనేశాడు. భలే భలే మగాడివోయ్‌తో నాని రేంజు పెంచిన దర్శకుడు కాబట్టి మారుతి పొగిడాడంటే న్యాయం ఉంది. మిగిలినవాళ్లందరిదీ ఇదే పరిస్థితి. దాసరి కూడా మారుతి జపం చేయడం ఆశ్చర్యం అనిపిస్తోంది. ”ఈ రోజుల్లో సినిమా విడుదల చేయడానికి తానెంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆ సినిమా ట్రెండ్ సృష్టించింది. బాబు బంగారంతో తాను స్టార్ డైరెక్టర్ అయిపోవడం ఖాయం” అన్నారు దాసరి. ఈరోజుల్లో, బస్ స్టాప్‌లు హిట్టయ్యాయి సరే. కానీ వాటిపై బూతు ముద్ర పడింది. ఆ సంగతి వక్తలు మర్చిపోతే ఎలా??