ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మూడు రాజధానుల అంశానికి సంబంధించి కేంద్రం తన వంతు ఎంత సహకారం కావాలో అంత సహకారం అందిస్తోంది. విభజన చట్టాన్ని ఉల్లంఘించి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని.. విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందని.. కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే.. రంగంలోకి దిగిన కేంద్రం.. ఈ అంశంపై ప్రభుత్వానికి అనుకూలంగా క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చట్టంలో ఉందని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.
రాజధాని విషయంలో కేంద్రానికి పాత్ర ఉందని.. విభజన చట్టం, శివరామకృష్ణన్ కమిటీ వంటి వాటిని ప్రస్తావిస్తూ.. కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని లేదా.. రాజధానులు అంశంలో తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేసింది. పిటిషనర్లు కేవలం అపోహతోనే ఉన్నారని.. కేంద్ర హోంశాఖ తెలిపింది. విభజన చట్టం ప్రకారం చూస్తే.. మూడు రాజధానులు పెట్టుకోవచ్చని కేంద్రం నేరుగా హైకోర్టుకు.. ఈ అఫిడవిట్ ద్వారా చెప్పినట్లయింది.
కేంద్ర ప్రభుత్వ చట్టంలో రాజధాని అని మాత్రమే ఉంది. “రాజధాని లేదా రాజధానులు” అని లేదు. శివరామకృష్ణన్ కమిటీ కూడా మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు రాలేదు. ఇవన్నీ తెలిసినప్పటికీ.. కేంద్రం కొత్తగా “రాజధాని లేదా రాజధానులు” పదం తీసుకొచ్చి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం.. న్యాయవర్గాలను సైతం విస్మయ పరుస్తోంది. మూడు రాజధానులకు పూర్తి స్థాయిలో సహకారం అందించే లక్ష్యంతోనే కేంద్రం.. ఇలా చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విబజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉంటే.. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మాత్రం.. దానికి “రాజధాని లేదా రాజధానులు” అనే భాష్యం చెప్పడం… కొత్త మలుపుగా అంచనా వేస్తున్నారు.